Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కణము నలుదిక్కులకు పెరుగక పొడుగునందు మాత్రము హెచ్చును. బలహీనస్థానము కొనయందుండుటచేత పెంపంతయు నక్కడనే గలుగును. ఇంతకుపూర్వ మేర్పడిన ముదురుకణముల కిక పెంపులేదు. వీనియమదు పెచ్చు అగుచుండు మూలపదార్థము పలుచని అడ్డుపొరలగుండ అంత్యకణములోనికి పోవును. అన్నిటికంటె ముదురుకణము బీజసమీపమున అనగా మొట్టమొదట నుండునది. అన్నిటిలో లేతకణ మంత్యకణము.

బూజుయొక్క ఆహారము.

బూజుపోగు ఎట్టి ఆహారము తినును? ఇది బొత్తిగా సత్తువ లేనట్టియు, ఇతరజీవుల కాహారము గాన నర్హమైనట్టియు పదార్థములు దొరికినను తృప్తిబొందును. ఇది మానవుల చెవిలో సహితము పెరుగగలదు. మురికిబట్టలకును చెప్పులకును అసహ్య పడదు. బుడ్డిలో నిగిరిపోయిన సిరామీదసహితము జీవింపగలదు. ఈషన్మాత్రము జీవజపదార్థముండిన చక్కెరనీళ్లుగాని, ఉప్పునీరుగాని దొరికిన దీనికి చాలును. రాగిచిలుము, పాషాణము మొదలయిన విషములు సహితము దాని కపాయకరములు గా నేరవు.

ఎట్టి ఆహారముతోనైనను తృప్తి పొందునట్టి గుణముగల దగుటచేత నీ ప్రాణి సర్వకాలములయందును, అన్ని చోట్లను వృద్ధిబొందును. మిక్కిలి చిన్నవి యగుటచేత గాలిలో నెల్లప్పుడు నీబీజములు కొట్టుకొని పోవుచుండును. అదిగాక దీని బీజమెంత కష్టకాలమునందయినను చావదు. ఎంత శీత ప్రదేశముల యందైనను, ఎంత ఉష్ణప్రదేశముల యందైనను జీవింపగలదు.