పుట:Jeevasastra Samgrahamu.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యీపిల్లకణములలో నొకటి పీపావంటి ఆకారముగలదై (D3. చూడుము) చుట్టు అంచును మూతబిళ్లయు ముడుచుకొని మొదటికొననుగూడ మృదురోమములవరుసను గూర్చుకొని, తల్లి కాడను తనతోడికణము ప్రత్యేకముగా ననుభవించుటకై వదలి కాడలేని ఆవర్తకారిగా వీడిపోవును. అది పటములో జూపిన ప్రకారము కొంతదూరము నీళ్లలో నీదుకొనుచుబోయి తన మొదలుతో నేదో యొకవస్తువు నంటి యా కొనయందుండు మృదురోమముల విసర్జించి క్రొత్తకాడ నేర్పరచుకొని క్రమముగా సంపూర్ణ ఆవర్తకారి యగును.

ఈప్రకారము సోదరుని పితృస్థానమునందు విడిచి తనకు మరియొకచోటును వెదకబోవు ఆవర్తకారియొక్క యుద్దేశము కొంచె మాలోచించిన తెలియగలదు. పై జెప్పినప్రకారము నిలువున చీలి ఏర్పడిన ఆవర్తకారులు రెండును, ఒక్కకాడనే యంటియుండి, తిరిగి వానిలో ఒక్కొక్కటియు పిల్లలుగా చీలి కాలక్రమమున అనేకము లొక్కచోటనే జేరెడునెడల అక్కడ నుండు ఆహారమంతయు త్వరలో ఖర్చుపడి అవి క్షామముపాలు కావలసివచ్చును. ఈప్రాణు లీ సంగతి గుర్తురెగినవై అట్టి యపాయము గలుగకుండ తమలో నొక్కటి స్థలాంతరమునకు బోయి ఏకఫలాపేక్షితులగు స్వజాతీయుల పోరు లేనిచోట సమృద్ధిగా నాహారము గొనుచు స్వేచ్ఛగా జీవించును.