మెలికలు గలదై చుట్టిచుట్టి పోవుచుండును. ఈపోగు పొడుగునను కాడయొక్క లోతట్టును అంటియుండును. ఇట్లు చుట్టిచుట్టిపోవునదగుటచేత నీపోగు సంకోచించునప్పుడు దాని నంటియుండు ఆవరణపుపొరను నలువైపులను సమముగ క్రిందకి నీడ్చు శక్తి గలదై యున్నది. ఆకస్మికముగా నీ కాడ ముడుచుకొనునప్పుడు పోగుయొక్క మెలికలు దగ్గిరపడి చిక్కనగును. ఈ పోగును కురుచయై లావగును. మూలపదార్థపుభాగములు ముడుచుకొనునప్పుడు వాని మొత్తపుపరిమాణము తక్కువ కానేరదని వికారిణివిషయమై వ్రాసినప్పుడే జెప్పియుంటిమి (6-వ పుట చూడుము). ఈ నడిమిపోగు గిన్నెయందలి పట్ట యనుభాగముతో సంబంధించినదే కాన మూలపదార్థపుభాగమే. పైని జెప్పిన ప్రకార మీపోగు కురుచయగునప్పుడు దానిచుట్టు నంటియుండు పైపొరగూడ స్థితిస్థాపకత్వము అనబడు రబ్బరువలె సాగెడు గుణముగల (Elastic) దగుటచేత పొట్టిదగుట సహజమే.
పొరయొక్క లోతట్టున ఏదో యొకప్రక్కనుమాత్రమే యీ పైపోగు అంటియుండునెడల ఆపొరను ఆవైపునమాత్రము కురుచయగున ట్లీడ్చి, రెండవవైపున నున్న భాగమును మొదటి వైపునకు వంచును. అటుగాక ఈపోగు చుట్టిచుట్టి పోవుచు వెలుపలిపొరను నలువైపుల నొకేరీతిగ నంటియుండుటచే పైపొర నంతటిని సమానముగ క్రిందికి ఈడ్చును. కనుకనే నడిమిపోగు పొట్టిదైనప్పుడు దానితోపాటు చుట్టునుండుపొరయును పొట్టిదగును.