పుట:Jeevasastra Samgrahamu.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యీతవంటి చలనమెగాక జలగనడకవంటి నడకయు గలదు. అప్పు డది యొకభాగమున ముడుచుకొని మరియొక భాగమున సాగియుండును. అది ఎట్లన్న, దాని దేహమును మూడుభాగములుగా నున్నట్లు ఊహించినచో అందు ప్రథమమున ముందరిభాగము కొంచెము లావయి తక్కినభాగములు సన్న మగును. క్రమముగా నాలావు మధ్యభాగమునకు వచ్చి ముందుభాగము సన్న మగును. మరల నాలావు వెనుకభాగమునకు గలిగి మధ్య భాగమును ముందుభాగమును సన్న మగును.

నిర్మాణము.

రక్తాక్షియొక్క దేహము మూలపదార్థముతో జేయబడినది. ఆమూలపదార్థముచుట్టును పలుచనిపొర యొకటి చర్మమువలె నావరించియుండును (9-వ పటము చూడుము). ఈ పొరయందు మిక్కిలి సన్నని రేఖలు (Striae) గలవు. ఇది దళసరెక్కి గట్టిపడిన మూలపదార్థమే యని చెప్పవచ్చును.

దీని మూలపదార్థములో హరితకము లిమిడియుండుటచేత రక్తాక్షి కీ యాకుపచ్చరంగు గలిగినది. దీని మూలపదార్థమధ్యమున జీవస్థానమును, దానిమధ్య అంతర్జీవస్థానమును స్పష్టముగ కన్పట్టును (పటములో జీ. చూడుము). ముందుభాగమున సంకోచనావకాశ మొకటి గలదు (సం. అ). రెండు కొనలయందును హరితకములు లేకపోవుటచేత నవి స్వచ్ఛముగ నుండును.