Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మధుశిలీంధ్రమునకు కావలసిన ఆహారపదార్థములన్నియు గలవని యాపట్టి చూచిన తెలియగలదు.

2. అమ్మోనియాతింత్రిణితము (Ammonium Tartrate):- దీనిని లోపింపజేసిన నీ కణములు చచ్చును. ఏలయన, అమ్మోనియా (Ammonia) ను విడిచినయెడల నీ కషాయమునందు నత్రజనము వేరే లేదు. అది లేనిచో మూలపదార్థ మెట్లు తయారగును? తింత్రిణితామ్లము (Tartaric acid C4 H6 O6)) మధుశిలీంధ్రమునకు కావలసిన కర్బనమును, ఆమ్లజనమును, ఉజ్జనమును సమకూర్చును గాన, నీరెంటియొక్క సమ్మేళనముచేనైన అమ్మోనియా తింత్రిణితము మిక్కిలి యనుకూలము.

3. పొటాసియ ఖటిక మగ్నములు:- ఇవి యాకషాయమునందు మిక్కిలి స్వల్పముగా నున్నప్పటికి నవి కొంచెమైనను లేనిచో నీ కణములు జీవింపనేరవు. చక్కెరయును, నత్రజన సంబంధమైన పదార్థములును ఎంత సమృద్ధిగ నున్నను పొటాసియము (Potassium), స్ఫురితము (Phosphate), ఖటికము (Calcium), మగ్నము (Megnesium), ఇవి ఈషన్మాత్రమైనను లేనిపక్షమున ఈకణములు జీవింపనేరవు. కాబట్టి ఈపదార్థము ఈకణముల ప్రాణమునకు ముఖ్యాధారమైన పదార్థములని గ్రహింపనగును.

4. తుదకు మగ్నగంధకితము నొక్కదానిని విడచినను ఈ కణములు వృద్ధిబొందనేరవు. అయినను పొటాసియ ఖటికములవలె నిది లేనిచో నవి మృతినొందవు గాని బహుమందముగా పెరుగుచుండును.