పుట:Jeevasastra Samgrahamu.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చక్కెర సారాయిగా నెట్లగునో యాసంగతి శోధించుట మన యుద్దేశము గనుక చక్కెరను జేర్చుట యగత్యమేకదా.

మధుశిలీంధ్రము వృద్ధిబొందవలయునని మనము కోరునెడల దాని శరీరనిర్మాణమున కావశ్యకమైన మూలపదార్థమును, సెల్లులూసును నిర్మించుకొనుటకు దాని కేయేపదార్థములు కావలెనో వానిని సమకూర్చవలెను. మూలపదార్థమునందు నత్రజనము (N), కర్బనము (C), ఆమ్లజనము (O), ఉజ్జనమును (H) గలవు. సెల్లులూసునందు నత్రజనము (N) తప్ప తక్కిన మూడునుగలవు. కాన నీనాలుగుపదార్థములును మధుశిలీంధ్రమునకు ముఖ్యావసరములైనవిగా నున్నవి.

అందు నత్రజనమును సమకూర్చుటకు నత్రజనముగల పదార్థమేదో యొకటి యుండవలెను. ప్రత్యేకము విడిగానుండు నత్రజనముగాని, లఘునత్రితములు (Simple Nitrates) గాని ఎంతమాత్రము మధుశిలీంధ్రకణముల కుపయోగకారులు గావని శోధనచే (Experiment) తెలిసికొనబడినది. నీటియందు లీనమగు మాంసకృత్తు లుపయోగకారులే కాని యనవసరముగా హెచ్చు మిశ్రములైనవి. కనుక యిందునకు పనికిరావు. ఈ రెండువిధములైన నత్రితములకును మధ్య నుండు నత్రజన సంబంధమైన పదార్థము లీ కణముల వృద్ధికి మిక్కిలి యుపయుక్తములైనవిగా నున్నట్లు శోధనవలన తెలియవచ్చినది. అందు అమ్మోనియా తింత్రిణితము (Ammonium Tartrate) మిక్కిలియనుకూలము. ఇందు నత్రజనము, కర్బనము, ఆమ్లజనము, ఉజ్జనము నాలుగునుగలవు.