మధుశిలీంధ్రము.
సంతానవృద్ధి విధానములు.
1. స్ఫోటనము (Budding):- పురపుర పొంగెడు కల్లుమీది, మడ్డివంటి ద్రవపదార్థమును సూక్ష్మ దర్శనితో పరీక్షించునప్పుడు దానియందుండు కొన్నికణముల యుపరితలమున చిన్న చిన్న మొటిమలు గన్పట్టును (ఇ-లో మొ). ఆ మొటిమలు క్రమక్రమముగా పెద్దవగును. కణమునందలి మూలపదార్థము కణకవచము నక్కడక్కడ ముందుకు త్రోసికొని పెరిగి పై జెప్పిన మొటిమలుగా నేర్పడును. ఇట్లేర్పడిన మొటిమయొద్దకు కణముయొక్క జీవస్థానముబోయి యక్కడ రెండుగా చీలును. అందొక ముక్క తల్లికణమున నుండును. రెండవది మొటిమలోనికి బోవును. ఈమొటిమ క్రమముగా పెరిగి గోళాకారమై తల్లికణమును ఒక చోటమాత్రము కొంచె మంటియుండును. తుదకు సెల్లులూసు పొర మొటిమకును తల్లికణమునకును మధ్య నడ్డముగా పుట్టి తల్లి కణమునుండి మొటిమను ఖండించును. పిమ్మట తల్లికణమును పిల్లకణమును వెవ్వేరుగా జీవించును. తరుచుగా పిల్లకణము తల్లికణమునుండి తెగిపోకమునుపే ఆ మొటిమకు పిల్ల మొటిమ పుట్టును (ఉ. చూడుము). ఈ పిల్ల మొటిమకు తిరిగి చిన్న మొటిమ కలుగవచ్చును. ఇట్లు తల్లి మొటిమకు పిల్ల మొటిమయు, దానికి దానిపిల్లయు, వరుసగా తల్లి, పిల్ల, మనుమరాలు అనునట్లుగా ఏల కాలమున నివి యన్నియు మొదటి కణము నంటియుండును. ఇట్టి సంతానవృద్ధి విధానమునకు స్ఫోటనము (Budding) అని పేరు.