పుట:Jeevasastra Samgrahamu.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విశేషము (42-వ పుట చూడుము). ఈ పొరయే కణకవచము (ఇ-లో క.క). మూలపదార్థములో, నొకటిగాని, హెచ్చుగాని, స్థిరముగ నుండు అవకాశములు (Spaces) గలవు (ఇ-లో అ). ఈకణముయొక్క ఆహార స్థితినిబట్టి వాని సంఖ్యయు పరిమాణమును మారుచుండును. ఇవి ద్రవపదార్థముతో నిండియుండును. ఈమూలపదార్థమునందు అణుమాత్రములైన నలుసు (Particles) లనేకములు గలవు. ఆనలుసులు కొన్ని మాంసకృత్తులు (Proteids); కొన్ని కొవ్వుపదార్థపుగోళములు (Fat globules). సామాన్యముగా నీ కణములయందు జీవస్థానము స్పష్టముగ తెలియకున్నను వానిని కొన్నిరంగులలో నూరనిచ్చినప్పుడు మూలపదార్థమధ్యమున చిన్నదియగు గుండ్రని జీవస్థాన మొకటి కానవచ్చును. ఈ కణముల కవచము మిక్కిలి పలుచని దగుట చేత తీక్ష్ణమైన సూక్ష్మ దర్శని నుపయోగించినగాని యది కనబడదు. అయినను వీనిని కుసుంభవర్ణము (Magenta) లో కొంతకాల ముంచినయెడల వీని మూలపదార్థమునకు బాగుగ రంగు పట్టును. అట్టి రంగుపట్టిన కణములను కొంచెము నొక్కి చితిపి సూక్ష్మదర్శనితో పరీక్షించునప్పుడు, కణకవచములు పగిలి లోపల నుండెడి యెర్రనిరంగు పట్టిన మూలపదార్థపు సముదాయములు వెలువడగా రంగుపట్టని వట్టితిత్తులు ప్రత్యేకముగా కనిపించును (ఎ-లో క.క. కణకవచము, మూ. ప. మూలపదార్థము చూడుము).