గాలియందును, గాలితో సంబంధముగల సమస్త వస్తువుల మీదను, మన శరీరములోపలను, శరీరముమీదను సర్వకాలములయందును వ్యాపించియుండును. చీము పుట్టించు సూక్ష్మగుటికలు మన గోళ్లలో దూరియుండు మట్టిలో నమితములుగ నుండును.
సూక్ష్మజీవులు మిక్కిలి చిన్నవియగుటచే దేశ దేశములకు వాయువేగముతో పోగలవు. ఈగలు దోమలు మొదలగు నల్ప ప్రాణులును, గాలియు, నీరును వాని ముఖ్యవాహనములు. వాని బీజములు పర్వతములమీది మంచుగడ్డల శీతలమునకుగాని, ఎడారులయందలి దుర్భరమైన యుష్ణమునకుగాని నశింపవు. అతివృష్టి యనావృష్టుల నవి సరకు జేయవు. ఇట్టిబీజముల రూపమున సూక్ష్మజీవులు తమ వృద్ధి కనుకూలముకాని ఋతువులందును స్థలములందును కొంతతడవు విశ్రమించి, తమ కనుకూలమైన కాలమును స్థలమును సందర్భపడినప్పుడు విజృంభించును. తొలకరివానలు కురిసినతోడనే కలరా ప్రారంభమగుట కిదియే కారణము.
జనసమ్మర్దము గల పట్టణములయం దీ సూక్ష్మజీవులు మిక్కిలి యధికముగ నుండును. ఎల్లప్పుడు నిర్మలమైనగాలి వీచునట్టి పల్లెలయందును ఉన్నతప్రదేశములయందును ఇవి మిక్కిలి తక్కువగా నుండును. లండను పట్టణమునందు పరీక్షార్థమై ఒక చదరపుటడుగు పరిమాణముగల పలకకు జిగురురాచి గాలిలో నుంచినయెడల దానిమీద నొక నిమిషములో రమారమి 300 సూక్ష్మజీవులు వ్రాలి యాపలక కంటుకొనునని శాస్త్రవేత్తలు లెక్కించి యున్నారు. ఈ సూక్ష్మజీవులన్నియు రోగము గలిగించునవి కావు.