పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



చూళిక

త్యాగరాజనగరంలో వివిధ పుష్పజాతుల పొదలు వృక్షాలు వికసించిన తోటమధ్య శ్రీమతి గీతాదేవి. అంటే పద్మావతి, వెంకట్రావుల మేడ ఉంది.

పద్మావతి బిరుదనామం గీతాదేవి!

గీతాదేవి జీవితంలో ఈనాటికీ పూవులు అన్ని రంగులతో, వివిధ సౌరభాలతో నిండార వికసిస్తున్నవి.

గాంధర్వ దేవతై, ఉత్తమాంధ్ర కర్ణాటకబాణిలో దివ్యమధురార్ద్రితమైన కంఠంతో సర్వరాష్ట్రాలవారిని సమ్మోహితుల, ఆనంద పరవశుల చేయగలిగిన పద్మావతికి, సంగీతలోలురైన ప్రజలు “గీతాదేవి” అని బిరుదును సమర్పించారు.

ఆమె కంఠంవిప్పి, రాగం ఆలపించినప్పుడు అర్ధవికాసితములు, పూర్ణావికాసితము లైన పూవులు జడులు జడులుగా కురుస్తవి. ఆమె పల్లవి ప్రస్తారంచేస్తే వివిధ సౌరభాలు సుళ్ళుదెసలు కలయజల్లుతాయి. ఆమె కీర్తన ఎత్తితే అమృతాలు వాకలు కట్టి శ్రోతల జీవితాలు ప్రవహించిపోతాయి.

ఆమే ఆ ఉదయం జాజిమల్లె పందిరికడ నిలుచుండి అరవిచ్చిన మొగ్గలుకోస్తూ పాట పాడుకుంటున్నది.

ఆమె తోటలోలేని పూవులు మదరాసులోనే లేవు. బోగైన్ విల్లాలు, దాలియాలు, గులాబులు, చేమంతులు, కార్నేషనులు, నాగలింగాలు, జాజి, సన్నజాజి, విరజాజి, చెట్టుమల్లె, బొడ్డుమల్లె, గుత్తిమల్లే, రేకమల్లె, జినియా, దయాంతస్, తోటంతా పూవుల జాతులే.

పూవుల వెండిసజ్జలోకి పూవులు కోస్తూవుండగా నరసింహమూర్తి మాష్టారు రెండేళ్ళబాలకుని ఒకణ్ణి ఎత్తుకు వచ్చాడు.

“అమ్మ.... పూలు కోత్తోన్ని"అన్నాడా బాలుడు.

“ఒరే నాన్నా! అప్పుడే తాతయ్యగారి భుజం ఎక్కావు?” అంటూ పద్మావతి పూలసజ్జ మేష్టారుకిచ్చి, బాలకుణ్ణి తా నందిపుచ్చుకొన్నది.

“పూవు-తే....” అని బాలుడు తల్లి చేతుల్లో ఎగిరి అల్లరి చేస్తున్నాడు. ఇంతట్లో బుచ్చి వెంకట్రావు కూతురు చెయ్యిపట్టుకొని తోటలోకి వచ్చాడు. బుచ్చి వెంకట్రావు పద్మావతి భర్త. “చూడు పద్మా! నీ కూతురు నాట్యం నేర్చుకుంటుందట. సంగీతంలో వాళ్ళ అమ్మకన్న గొప్పదవుతుందట. నా దగ్గిర ఒకటే కోతలు!”

“అవునమ్మా! నాపాట చాలా బాగుంటుందని నువ్వు అనలేదేమిటి?” అని అయిదేళ్ళ సాగరిక నాట్యంచేస్తూ పాట పాడడం ప్రారంభించింది.

నరసింహమూర్తి మాష్టారు తాళం వేయసాగారు. తాను తలిదండ్రులతో, నరసింహమూర్తి మాష్టారుతో ఆమధ్య చూచిన కుమారి నటసుందరి భరతనాట్యంవలెనే అద్భుతంగా నాట్యంచేస్తూ ముగించింది.

అడివి బాపిరాజు రచనలు - 7

95

జాజిమల్లి(సాంఘిక నవల)