పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ కష్టం అంతా చూచి మూర్తి ఆ సరుకు అతి సులభంగా విద్యుచ్ఛక్తి సహాయంవల్ల పైకి వచ్చే తీగదారి ఏర్పాటు చేశాడు. అంచెలు అంచెలుకడ యంత్రాలు ఉంటాయి. అక్కడినుండి పైకి బరువులుంచిన ఉయ్యాలలను లాగే తీగలుంటాయి. ఆ ఉయ్యాలలను ఒక తీగలాగుతూ ఉంటే రెండు తీగలమీద, రెండు చక్రాలతో ఈ ఉయ్యాలలు సువ్వున పైకి పోతాయి. వానిమీద మనుష్యులూ ప్రయాణించవచ్చును.

మూర్తి పనిచేస్తూంటే అక్కడికి మూర్తితోపాటు ఒక్కొక్కసారి ఉదయం వంటవానిచేత తయారు చేయించిన వంటకాలు, కాఫీ గొట్టాలు, పళ్ళు అవీ భోజనపు పెట్టెలలో పెట్టించుకొని అవి సేవకుల నెత్తిమీద పెట్టి జెన్నీ కూడా వచ్చేది.

జెన్నీతో ఆమె కొన్న పెద్ద “బుల్ డాగు” జాతిలో మేలుజాతి కుక్కకూడా వస్తుంది.

మూర్తికి పని అయి తనకడకు వచ్చేవరకూ జెన్నీ కుక్కతో ఆ కొండలలో తిరుగుతూ ఉంటుంది. ఆ కుక్క పేరు ఫెయిత్ (నమ్మకం) అని పెట్టింది. భార్య సరదాగా తిరగడం, తనకు వేళకు భోజనం తమకు ఆ దాపునే ఒక చెట్టు క్రింద వేసిన డేరాలో క్యాంపు బల్లమీద చక్కగా అంచులు కుట్టిన తెల్లటి గుడ్డవేసి భోజనం అమర్చి “ఫెయిత్! నీ యజమానుణ్ణి తీసుకురా!' అని పంపేది జెన్నీ. ఆ కుక్క మరుసటి నిమేషంలో మాయమై మూర్తి దగ్గరకు వచ్చి "దయచేయండి” అన్నట్టుగా కుర్రుమని అతనిపైకి ఉరికేది. బలువైన, బలపూర్ణమైన ఆ కుక్కను మూర్తి చేతులతో అందుకొని క్రిందికి దింపి “వస్తున్నాను ఫెయిత్?” అని యిద్దరూ డేరాకు బయల్దేరుతారు..

డేరాకు రాగానే మూర్తి పక్కనున్న చిన్న డేరాకు పోయి, అక్కడ మొగమూ చేతులూ కడుక్కొని, బట్టలు మార్చుకొని, ఆమెకు తనివితీర మూడు ముద్దులు అర్పిస్తాడు.

ఆమె, అతడూ ఎదురు బొదురుగా కుర్చీలలో కూర్చుండి తీయని, మత్తయిన కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తారు. ఒక బోయ్ వడ్డిస్తూ ఉంటాడు. భోజనాలు పూర్తి కాగానే అతడు సిగరెట్టు వెలిగించుకొని మాటలు చెబుతూ జెన్నీని చూచి తన అదృష్టం తానే నమ్మలేకపోతూ ఉంటాడు.

ఒకనాడు జెన్నీ భర్తను చూచి, “ప్రియతమా! మీ నాన్నగారూ, మీ అమ్మా, అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు ఏమి చేస్తున్నట్లు?” అని ప్రశ్నించింది.

“కులాసాగానే ఉన్నారు.”

“కులాసాగానే ఉంటారోయ్! అది కాదు నేనడిగిన ప్రశ్న వాళ్ళ విషయం ఏమీ ఆలోచించావని?”

“వాళ్ళకై భీమవరం పాటిదొడ్డల్లో ఒక దొడ్డి కొనే ఏర్పాటు చేసినాను. ఆ దొడ్డిలో పాటిమన్నంతా అమ్మి ఇసుకపోసి పూడ్చినారట. ఒక గజం యెత్తు నల్లమన్ను పోయించమన్నాను. అలాగే చేశారట. ఎనిమిది గదులు ఒక హాలు వుండే డాబా ఇల్లుకు ప్లానువేసి పంపాను. వంట ఇల్లు వేరు. అన్నీ కలిపి ఆ ఊళ్ళో పన్నెండు వేలయిందట. నేను అమెరికాలో ఉన్న రెండేళ్ళు పదిహేనువేల డాలర్లు సంపాదించుకొన్నాను. ఇంక నా దగ్గర బాంకులో ఎనిమిదివేల రూపాయలు నిలువ వున్నాయి. మా తండ్రి పేర అయిదువేల రూపాయలు బ్యాంకులోవేసి ఉంచాను. వాళ్ళకు రెండేళ్ళకు సరిపోయే గుడ్డలు

అడివి బాపిరాజు రచనలు - 7

80

నరుడు(సాంఘిక నవల)