పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పోలండు తర్వాత హిట్లరు ఎవరిమీద విరుచుకు పడతాడో తెలియలేదు. ఇంగ్లండుమీదకే దండెత్తవచ్చునన్న వదంతులు బాగా ప్రబలి ఉన్నాయి. 1939 అక్టోబరు నెలలో బొంబాయి ప్రభుత్వంవారిని కేంద్ర ప్రభుత్వం వారు పడమటి కనుమలలో విద్యుచ్ఛక్తి పరిశ్రమ బాగా వృద్ది చేయమన్నారు. ఆ పరిశ్రమను యుద్ధావసరాలలో ఒకటిగా కేంద్ర ప్రభుత్వం చేర్పించవలసి వచ్చింది. హిట్లరు ఇండియాకు రాలేడని ఎవరు చెప్పగలరు? అందుకై ఇండియా యుద్ద పరిశ్రమలలో ఎక్కువ పాలుపుచ్చుకోవాలి!

భారతీయ ప్రభుత్వంవారు కూడా జర్మనీపై యుద్ధం ప్రకటించారు. భారతీయ సేనలు సిద్దంగా ఉండవలసి ఉన్నది.

భరతదేశంలో పూనా సైన్య కేంద్ర పెరిగిపోతున్నది. పడమటి కనుమలలో కొన్నికొన్ని యుద్ధ పరిశ్రమలు స్థాపించవలసి వచ్చింది. ఆ పరిశ్రమలకు విద్యుచ్ఛక్తి అవసరము.

కాబట్టి మూర్తి కలలుకన్న ఆ విచిత్ర జలాశయ నిర్మాణానికి మూర్తి కోరిన రెండు కోట్ల రూపాయలు ప్రభుత్వంవారు వెంటనే మంజూరు చేసినారు. పెద్ద ఇంజనీర్లు వచ్చినారు. అందుకు సంబంధించిన వారెందరో వచ్చినారు.

మూర్తి వేసిన ప్రణాళిక ప్రకారం నిట్టనిలువునా వున్న ఆ రెండు కొండలూ కలిపి జలాశయం నిర్మించాలి. కట్టవలసిన రెండు కొండల నడుమ నది వేయి పతనాలుగా పడి ప్రవహిస్తున్నది. క్రింద జలాశయం ఇదివరకే నిర్మాణం అయి, దానివల్ల చాలా విద్యుచ్ఛక్తి ఉత్పత్తి చేసేటటువంటి పరిశ్రమాగారం నిర్మించారు.

నాలుగు వందల అడుగుల ఎత్తునుంచి వేయి చిన్న పతనాలుగా పడే ఆ నది ఒక చోట రెండు మూడు వందల చదరపు గజాల వైశాల్యం మాత్రం కలిగిన శిఖరంపైన ఒక చిన్న కొండమీద ఎగుడు దిగుడుగా, వంకరటింకరగా ప్రవహించినది. మళ్ళీ పతనాలై పడుతున్నది.

ఎల్లమంద ఆలోచన ఇది. ఆ రెండు వందల పైచిలుకు చదరపు గజాల ప్రదేశంలోనూ జలాశయం నిర్మించి, ఆ చరియను దిట్టంచేసి, అక్కడనుంచి పెద్ద గొట్టాల ద్వారా జలప్రవాహం ప్రక్కగా ఆ కొండలలో ఇంకో సమతలానికి తీసుకువెళ్ళి అక్కడ విద్యుచ్ఛక్తి కర్మాగారం స్థాపించాలి. అక్కడనుండి ఆ నీరు మళ్ళీ గొట్టాల ద్వారా తీసుకువచ్చి క్రింద జలాశయం లోనికి కలపాలి.

ఈ పనికై దగ్గిర ఉండి ఆ ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించి లెక్కలు, ప్లాన్లు తయారు చేశాడు. అతని చేతి క్రింద నలుగురు ఒవర్‌సీయర్లు, డైనమైట్ పెట్టి ఆ శిఖరతలం అరుగులా సమంగా చేయ ప్రారంభించారు. పని అతివేగంగా తాను దగ్గిర ఉండి చేయిస్తున్నాడు. పగిలి విడివడిన రాళ్ళను ముక్కలుచేసి తన పనికి పనికిరావడంకోసం చిన్న చిన్న రైలుపట్టా బండ్లపై ఇంకో స్థలానికి లాక్కుని వెళ్ళి అక్కడ పోగు చేయించి అందులో కొన్నింటిని మరీ చిన్నవిగా సిమెంటు కాంక్రీటుకోసం కొట్టిస్తున్నాడు.

క్రిందనుంచి పొట్టి గుర్రాలమీద రోజూ సిమెంటు బస్తాలు, లావుపాటి ఇనుపకడ్డీలు, తీగెలూ తీసుకు వస్తున్నారు.

అడివి బాపిరాజు రచనలు - 7

79

నరుడు(సాంఘిక నవల)