పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తలుపు నెమ్మదిగా ఇంకను తోసినాడు. తలుపు వెనక తెర ధరించిన కాండ పటము రాధకృష్ణ విలాసమగు ఒక బృందావన క్రీడాచిత్రంతో ప్రత్యక్షమయినది. రంగురంగుల మనోహరమైన ఆ చిత్రం పై నీలపు వెలుగు పడుతున్నది.

అతడు కాండపటం వెనకనే నిలుచుండినాడు. మరి పది క్షణికాలు గడచి పోయినాయి.

ధైర్యం పట్టుకొని తలుపుమూసి, నెమ్మదిగా గడియవేసి అతడు కాండపటం ప్రక్కనుండి లోనికడుగిడినాడు.

ఎదుట కనుపించిన దృశ్యము అతని హృదయ స్పందనమొక నిమేషం మాపుచేయగలిగిన దివ్యసౌందర్యపూర్ణము.

తల్పము పాలసముద్రంలో తేలిపోయే దేవవిమానంలా ఉన్నది. తల్పము తెల్లని సన్నని వల తెరలతో అచ్చాదితమై ఉన్నది. గది అలంకారము తల్పానికి శ్రుతిపూర్ణము.

అతడు నెమ్మదిగా అడుగడుగువేస్తూ తల్పంకడకు పోయి, ఆ తల్పంపై అస్పష్టంగా దృశ్యమయ్యే మనోజ్ఞత్వ రాశిని ఆస్వాదిస్తూ తెరలు ఒత్తిగించి చూచినాడు.

జెన్నీ కోటిగులాబీలతో మూర్తికట్టిన జీవవిగ్రహము పాము కుబుసాల దుస్తులు హౌరీలా అలంకరించుకొని, ఒయ్యారంగా త్రిభంగిగా శయనించివున్నది. ఆమె కనులు అరమూతలై ఉన్నవి! ఆమె ఎఱ్ఱన పెదవులు కొంచెము విడివిడి ఉన్నవి.

తనివి ఎంతకును తీరనికాంక్షతో ఆమె సౌందర్యాన్ని గ్రోలుతూ అతడటులనే నిలుచుండి, మరునిమేషాన ఆమె పై వాలిపోయినాడు. ఆమె నెమ్మదిగా అతనివైపు తిరిగి చేతులు చాచి అతని మెడచుట్టూ ఆ దంతాలచ్చలతలు చుట్టివేసినది.

అతడామెపై వంగి విడివడి వున్న ఆ తేనె పెదవులను అతి తమితో ముద్దిడినాడు.

4

దేవీ పర్వతపులోయ, లోనవాలాకు పదిమైళ్ళున్నది. ఆ లోయలో అయిదారు సెలయేరులు కొండమీదనుండి పతనమై కలిసి పెద్ద నదిగా సంగమించి లోనవాలా లోయలోనికి ప్రవహిస్తున్నది. లోనవాలా లోయలో నదికి ఆనకట్ట కట్టి ఉదకశక్తి జనిత విద్యుచ్ఛక్తి సంస్థను ఇదివరకే ఏర్పాటు చేసినారు. ఈ జలాశయంలోనికి ప్రవహించే శైలివాలినులలో పెద్దదానిలో జలాశయానికి మూడువందల అడుగుల ఎగువనే రెండు పెద్ద ప్రస్రవణాలు సంగమిస్తున్నవి. ఆ సంగమస్థల దగ్గిర వేరొక్క జలాశయం నిర్మిస్తే, దానివల్ల మరికొన్ని లక్షల కిలోవాట్లు ఉద్భవించే విద్యుచ్ఛక్తి యంత్రాగారం నిర్మించవచ్చును.

ఈ భావము మూర్తికి ప్రత్యక్షమై, బొంబాయి ప్రభుత్వానికి రాయడంతోటే, వారెంతో ఆనందించి, ఆ విషయం కేంద్ర ప్రభుత్వానికి రాస్తూ, “మూర్తి” ఇంజనీరుగారిని తమ కా పనిని నిర్వర్తించేందుకు అప్పు ఇవ్వవలసిందని కోరినారు. ఈ విషయం కేంద్ర ప్రభుత్వానికీ, బొంబాయి ప్రభుత్వానికీ అతి తొందర కార్యం అవడానికి కారణం యుద్దం.

చిన్న చిన్న గాలిగా ప్రారంభించిన యుద్దం అప్పుడే ప్రళయ ఝంఝామారుతంలా పరిణమించినది. హిట్లరు సగం పోలండు ఆక్రమించితే, రష్యా తూర్పు పోలండు ఆక్రమించుకొన్నది. డాన్జిగ్ జర్మనీ పాలను పడింది. యూరపు దేశాలలో జర్మనీ దగ్గిర దేశాలన్నిటిలో నాజీ రాజకీయ వేదాంతాలు ప్రబలిపోతున్నాయి.

అడివి బాపిరాజు రచనలు - 7

78

నరుడు(సాంఘిక నవల)