పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ మర్నాడు వారు ముగ్గురూ బయలుదేరి ఢిల్లీ వెళ్ళినారు. ఢిల్లీలో వారు ముగ్గురూ మూర్తి యింట్లో మూడు రోజులు ఉండి జెన్నీ మూర్తులు రిజిష్టర్ వివాహం చేసుకొన్నారు.

జెన్నీ ఒక మంచి గుజరాతీ హోటలుకు ఆజ్ఞ ఇచ్చి పదిమందికి చక్కని విందు చేసింది. మూర్తి ఆ రాత్రే భార్యతో బొంబాయి మెయిలుమీద మొదటి తరగతి రిజర్వు చేసుకొని బయలుదేరినాడు. లయొనెల్ మదరాసు ప్రయాణం అయినాడు.

ఆ రైలు పెట్టెలో వారిద్దరూ ఒంటిగా ఉన్నారు. రైలు కదలగానే జెన్నీ వచ్చి భర్త ఒళ్ళోకూచుని అతని మెడచుట్టూ గట్టిగా చేతులుచుట్టి అతని పెదవులను ఉద్రేకపు చుంబనంతో అదిమివేసింది. అతడు పెన్నిధిలా ఆమెను తన హృదయానికి అదుము కొన్నాడు.

వారికి మాటలు లేవు. ఆమెతో కలిసి ఈ లోకాలలో ఎక్కడికో పోతున్నట్లు అతనికి భావం కలిగింది. ఆమె ఉద్రిక్త భావపూర్ణ అయినది. అతడు విద్యుత్ ప్రవహించే మేఘంలా వెలిగిపోయినాడు.

అతడు వేగంగా, మధురాతి మధురంగా, గాఢంగా ఆమె పెదవులను చుంబిస్తూ, ఆమె మోమును వెనక్కు వంచుతూ, ఆ బాలిక కన్నుల అందం చూచీ, కన్నులు చుంబిస్తాడు. కనుబొమల వంకర సొంపులు చూచి అవి ముద్దుగొంటాడు. ముక్కుపుటాలు, నాసికారేఖా ప్రవాహం చూచి, పెదవుల నాస్వాదిస్తాడు; పెదవుల ధనుర్విలాసం, ఆర్ద్రత వానిపై వర్తించే ఆనందమత్తతాపూర్ణ మందహాసరోచిస్సులు, ఆ పెదవుల మందారపు టెరుపులు చలించే అమృతాలు చూచి ఆ పెదవులను తన కర్కశపు పెదవులు చుంబిస్తే, అవి కరిగిపోతాయని భయపడి, 'క్షమించండి పెదవులారా!' అన్నట్టు చూపులు పరపి, కనులు మూసుకొని సిగ్గుపడు బాలకునిలా ముద్దుగొన ప్రారంభించి దొంగలా దోచుకొంటాడు.

ఇంతటితో తృప్తిపడడు. ఈ ముద్దులు ఇంకా దాహం కొలుపుతూ ఇంకా తృప్తితీరుస్తూ ఆ తృప్తిపై కాంక్షకు దారి చూపగా, ఆ కాంక్షనందుకొని దానిని తృప్తిపరుస్తూ కాంక్షాతృప్తులు అనంతంకాగా, ఆ అనంతతను అందుకోలేనని నిస్పృహపొందుతూ, తానూ నిత్యుడై తన శృంగారోద్రేక స్థాయినీ నిత్యను చేస్తాడు.

వెంటనే అతని చూపులు ఆమె విచిత్రశ్రుతిస్వరూప సౌందర్య విలాసిత చుబుకంపై ప్రసరిస్తాయి. ఆ చుబుకం అతని చుంబన పుంఖానుపుంఖితమైన దాడికి లోనవుతుంది. ఆ చుబుకాన్ని రక్షించడానికి ఆ బాలిక కపోలాల భావం అడ్డం వచ్చి నిలుస్తుంది..

ఆ కపోలాలు ఒకటికొకటి సహాయం చేసుకుంటూ అతని నాయకహృదయ శిఖరితోత్కంఠ వేగాన్ని చీకాకు పరుస్తాయి. ఆ వేగం ఓడిపోయి, ఆమె కంఠనిమ్నంలోనికి ఉరుకుతుంది. సరియైన పొడుగు, నీలిధమనిరేఖలు దంతంతో చెక్కిన ఆ కంఠసీమ అందంలో వెనకటికన్నీ మరచి ఆ చూపు దక్షిణ నాయకుడైపోయినది. పెదవులా కంఠాన్ని వదలలేదు.

ఇంతలో ఈ గడబిడ ఏమని కంఠసీమ పక్క కాపురం చేయు తెల్లమల్లెమొగ్గల గుత్తులుగా ఉన్న భుజస్కంధాలు రెండూ “ఏలనే నవ్వంటు” కనుక్కోవడానికి తొంగిచూస్తే చూపులు అల్లరి తుమ్మెద దొంగలులా ఆ మల్లెమొగ్గ గుత్తులు భుజాలపై వాలినవి.

అడివి బాపిరాజు రచనలు - 7

74

నరుడు(సాంఘిక నవల)