పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సేనా: ప్రస్తుతం బొంబాయి ప్రభుత్వం విద్యుత్ ఇంజనీరు. కానీ అమ్మాయీ?

జెన్నీ: ఈ ప్రేమగాథ మా చిన్నన్నకు తప్ప మరి ఎవ్వరికీ ఇష్టంలేదు. నేను ఢిల్లీ వివాహంకోసం వచ్చాను. మా పెద్దన్న గారు మా వదినకు జబ్బు వంకతో నన్నిక్కడకు తీసుకువచ్చారు. మా చిన్నన్నగారు వచ్చి నన్ను పంపితే నేను ఢిల్లీ వెళ్ళాను, అక్కడకు నా వెంటనే మా పెద్దన్నగారు వచ్చి తీసుకువచ్చి నా బాగుకోసం నన్ను గదిలోపెట్టినారు.

సేనా: ఆహా. ఏమంటావయ్యా మేజరుగారూ?

మేజరు కార్లయిల్: అన్నీ ఒప్పుకుంటాను.

సేనా: ఆమెను పోనియ్యి. కెప్టెన్! మూర్తిగారిని ఇల్లా పిలు.

మూర్తి దగ్గిరకు కెప్టెన్ వచ్చాడు. గుండె కొట్టుకుంటూ ఉండగా మూర్తి లేచి వెళ్ళి సేనాపతికి వీరనమస్కారం చేశాడు. సేనాపతి మేజరు కార్లయిల్ వంక చూచి, “మీరు మూర్తిగారితో కరస్పర్శ గావించండి.”

మేజరు కార్లయిల్ మోము వాలిపోయింది. అయినా తనస్థితి తనకు తెలుసును. సేనాపతి దృష్టిలో తాను ఉత్తముడు కావాలి. వెంటనే చేయి చాపి, “క్షమించండి మూర్తిగారూ!” అన్నాడు.

సేనా: మీరు వెళ్ళండి మేజరు కార్లయిల్.

మేజరు కార్లయిల్ వెళ్ళగానే, జెన్నీ సేనాధిపతికి నమస్కరించి కళ్ళనీళ్ళు తిరుగుతుండగా, “మీ సహాయం నా జన్మలో ఎప్పటికీ మరచిపోలేను,” అన్నది. సేనాపతి లేచి భుజంచుట్టూ చేయి పోనిచ్చి.

“నువ్వు మా ఇంటిలో నాలుగు దినాలుండి వెళ్ళు,” అని కోరినాడు.

“మేము వెంటనే బయలుదేరి వెళ్ళి ఢిల్లీలో వివాహం చేసుకుంటాము. ఒక్క నిముషం ఆలస్యం చేయదలచుకోలేదు కాల్నెల్‌గారూ!” అని బ్రతిమాలుతూ జెన్నీ అన్నది.

“అందాకా ఎక్కడ వుంటావు?”

మూర్తి సేనాపతికి కృతజ్ఞత తెలిపి, “కార్నెల్‌గారూ మేజరు కార్లయిల్ సోదరుడు లయనెల్ కార్లయిల్‌గారు ఇక్కడే - హోటలులో వున్నారు. జన్నీఫర్‌ను నేను లయెనెల్‌కు అప్పగిస్తాను. మేము ముగ్గురం రేపే బొంబాయి వెళ్ళిపోతాము. బొంబాయిలో మా వివాహం అవుతుంది. తమ కరుణను ఎప్పుడూ మరువలేను. కృతజ్ఞుడను,” అని మనవి చేశాడు.

సేనాపతి తనకారుమీద వారిద్దరినీ లయనెల్ ఉన్న హోటలుకు పంపినాడు.

2

లయనెల్ వీరిద్దరినీ చూచి ఆశ్చర్యమూ, ఆనందమూ పొంది, ఇద్దరినీ హృదయానికి అదుముకొన్నాడు. చాలాసేపు జెన్నీ భవిష్యత్తు, జెన్నీ మూర్తుల వివాహమూ అన్నీ ఆలోచించుకుంటూ కూచున్నారు. లయనెల్ దగ్గర వదిలి మూర్తి తన హోటలుకు వెళ్ళిపోయినాడు.

అడివి బాపిరాజు రచనలు - 7

73

నరుడు(సాంఘిక నవల)