పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అప్పుడు ఎల్లమంద జెన్నీ చరిత్ర వారికి చెప్పి, మేజరు కార్లయెల్ చేసినదంతా మనవి చేశాడు. ఎవరినైనా పంపి మేజరు తన చెల్లెల్ని తాళం వేసి ఉంచినాడో లేదో కనుగొనవచ్చునని మనవి చేశాడు.

“కాల్నెల్ -” గారు స్వచ్చమయిన ఇంగ్లీషువాడు. అతనికి మేజరు కార్లయెల్ సంకరం వాడైనా శుద్ద ఇంగ్లీషు వానిలా సంచరించడం ఏమీ ఇష్టంలేదు. కాని కాంగ్రెసు ప్రభుత్వాలు వున్న రోజులు. దేశంలో స్వాతంత్ర్య వాతావరణం బాగా వుంది. పైగా కేంద్ర శాసనసభలో ఎవరయినా ప్రశ్నలు వేయవచ్చును. ఇవన్నీ ఆలోచించి, చూచీ చూడనట్లు ఊరుకున్నాడు. ఇప్పుడు మూర్తి చెప్పిన సంగతులన్నీ విని ఈ సంకరులకు నల్లవాళ్ళ కన్న సంబంధాలకు ఎవరు బాగా పనికివస్తారేమి? అనుకొని, గంటకొట్టి ఆర్డర్లీన్ని పిలిచాడు.

నువ్వుపోయి "కేప్టను-” గారిని తీసుకురా అని ఆజ్ఞ ఇచ్చాడు. అయిదు నిమిషాలలో “కేప్టన్-” వచ్చి సైనిక వందనంచేసి కఱ్ఱలా నిలుచున్నాడు.

“ఏమయ్యా నీవు మేజరు కార్లయెల్ ఇంటికిపోయి నా ఆనతి చెప్పి, ఫలానా గదికి వేసిన తాళం తీయించి, ఆ గదిలో ఉన్న బాలికను ఇక్కడకు తీసుకుని రమ్మనమన్నానని చెప్పు.”

కెప్టెన్ మళ్ళీ సైనికవందనం సలిపి, పైకివెళ్ళి కారు ఎక్కి మేజరు కార్లయెల్ ఇంటికి వచ్చాడు.

ఈలోగా అక్కడే ఉన్న వేరే గదిలో కూర్చుండమని చెప్పి ఆ సేనాపతి మూర్తిని పంపినాడు. అరగంటలో కారు వచ్చిన చప్పుడయింది. లోనికి జెన్నీ, మేజరు కార్లయెల్, ఆ కెప్టనూ వచ్చిన చప్పుడయింది. సేనాపతి గది దగ్గిరగా ఉండడంవల్ల ఆ గదిలో మాటలు స్పష్టంగా మూర్తికి వినబడుతున్నాయి.

సేనాపతి: (లేచి జెన్నీకి కుర్చీ చూపిన చప్పుడు.)

గుడ్ మార్నింగ్. మీరేనా డాక్టరు జెన్నీఫరు కార్లయిల్?

జెన్నీ: అవును.

సేనాపతి: మేజరు కార్లయిల్ మీ అన్న?

జెన్నీ: అవును.

సేనాపతి: మిమ్మల్నెందుకు మీ అన్నగారు గదిలో ఉంచి తాళం వేశారు.

జెన్నీ: నిముషం (మౌనం)

సేనా: చెప్పండి డాక్టర్! మీకు భయంలేదు. మీ అన్న చేసిన ద్రోహం యావత్తూ నాకు తెలిసింద.

మేజర్ కార్లయిల్: నేను మనవి చేసేది.

సేనాపతి: ఊరుకోవయ్యా - చెప్పు బాలికా, ఏమీ భయంలేదు.

జెన్నీ: చేప్తానండి, నేను మూర్తి అనే హరిజన యువకుణ్ణి ప్రేమించాను. అతడూ నన్నుప్రేమించాడు. అతడు ఇంగ్లండు విద్యుత్ ఇంజనీర్ పరీక్షలో కృతార్థుడై అమెరికా వెళ్ళి ఉదకజనిత విద్యుత్ శాస్త్రం బాగా నేర్చుకొని తరిఫీదై వచ్చాడు. ఇప్పుడు కేంద్రప్రభుత్వంలో ఉద్యోగి..

అడివి బాపిరాజు రచనలు - 7

72

నరుడు(సాంఘిక నవల)