పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నెమ్మదిగా తమాయించుకొన్నాడు. అవును మాదిగ వాళ్ళకు చదువేమిటి? ఉద్యోగం ఏమిటి? ప్రేమ ఏమిటి? పెళ్ళి ఏమిటి?

వంటినిండా గంధం రాసుకొని, పసుపు బట్టలు కట్టుకొని బానలు బానలు తాగుతూ పెళ్ళిళ్ళు చేసుకొనే మాదిగ వాళ్ళకు ఉత్తమ సంస్కార వివాహం ఏమిటి?

తమలో ప్రేమలు ఏమిటి? తామంతా ఊరకుక్కలు. ప్రేమలు లేవు, నీతులు లేవు, ఉత్తమ స్థితి లేదు.

మాదిగ వారిలో పుట్టి, మాదిగ వాడలో పెరిగి, తాను చదువుకొనేందుకు సాహసించడమా? ఒక ధవళ కాంతుల అందమైన బాలికను ప్రేమింప సాహసించడమా? తమ సంఘానికి ఇది ఇంత అని నుదుటిపైన రాసివుంది. దానికి మించి వెళ్ళడానికి ఎవరు సాహసించేది? మానవ ప్రపంచం మాదిగవాళ్ళంటే అసహ్యించుకొంటుంది. చీదరించుకొంటుంది. తన సంఘాన్ని గాంధీగారు ఉద్దరిస్తారని తాము గంపెడంత ఆశపెట్టుకొని వుండడం అంత వెర్రిపని ఇంకోటి వున్నదా? కరడుకట్టి, రాయైపోయిన సంఘాన్ని ఎవరు మార్చగలరు? ఎవరో తనబోటి నలుగురయిదుగురు, అంబేద్కరులు, శివరాజులు, పన్నీరు శెల్వాలు, రాజభోజులు, బి.ఎస్. మూర్తి మొదలయినవారు పైకివచ్చినా కూడా పై కులాల వారు తమ ఇంట్లో తమతో సమానంగా వారికి భోజనం పెడ్తారా?

తనకు ఈ నిర్వేదం అంతా ఏమిటి? ఎందుకీ ఏడ్పు గొట్టు కవిత్వం? నడుంకట్టి పనిచేయాలి. ఎంత ఇనుమైనా కొట్టగా కొట్టగా ముక్కలై పిండి అయిపోతుంది.

వెంటనే మూర్తి వారం రోజులు సెలవు పుచ్చుకొని, తిన్నగా పెషావరు వెళ్ళినాడు. లయనెల్ వున్న హోటలులో లయెనెల్‌ను కలుసుకున్నాడు. ఇద్దరూ ఫ్రెంచివారిలా, ముస్లిం సోదరులులా కౌగలించుకొన్నారు.

“నువ్వు వస్తావని నేను అనుకుంటూనే ఉన్నాను.”

“ఎలా రాకుండా ఉండగలను? జెన్నీ ఎక్కడ? ఎల్లా వున్నది?”

“జెన్నీ కులాసాగానే ఉన్నది. కాని మా అన్న ఆమెను ఒక గదిలో పెట్టి తాళం వేస్తున్నాడని నాకు రూఢిగా తెలిసింది.”

“ఈ రోజుల్లో-"

“రోజులు మారుతాయిగాని, మనుష్యులు మారుతారా మూర్తీ!”

“నీ ఆలోచన?”

“నా ఆలోచన మా చెల్లెలిని తీసుకురావడమే!”

“ఎలాగ సాధ్యం?”

“అదే ఆలోచిస్తున్నా, మా అన్నకు నేను ఇక్కడ వున్న సంగతి తెలిసింది.”

ఎల్లమంద ఆ హోటలులో స్థానం దొరక్క ఇంకో హోటలులో పెషావరుపురంలోనే మకాం పెట్టినాడు. తిన్నగా ఆ మర్నాడు చక్కనివేషం వేసుకుని ఆ స్కంధావారానికి సేనాపతి అయిన "కార్నెల్ - ” గారి దగ్గరకు పోయి తన చీటీ వారికి పంపినాడు. ఆయన లోనికి రమ్మని ఆజ్ఞ ఇవ్వగానే వెళ్ళి నమస్కరించి వారు చూపించిన కుర్చీపై కూర్చుండి తన కాగితాలన్నీ చూపినాడు. అవి చూచి "కార్నెల్ -” గారు సంతోషమైన ముఖంతో “ఆనందం” అన్నారు.

అడివి బాపిరాజు రచనలు - 7

71

నరుడు(సాంఘిక నవల)