పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నీకు ఉత్తరం రాసిన వెంటనే వదినకు ఎలావుంది. జబ్బేమిటి అని జెన్నీకి రాశాను. అందులో మా అన్న నిన్ను ఏలా అవమానించాడో అదీ రాశాను. దానికి జవాబు రాలేదు. నాకు ఆశ్చర్యం వేసింది.

మా వదినకు జబ్బుగా వుంది. నేను వెళ్ళి చూసివస్తానంటే విజ్జీ సరేనంది. నాకు కూతురు పుట్టిన సంగతి వెనకే రాశాను. చిన్న విజ్జీ వెన్న ముద్దల పాపాయిలా తయారైంది. వారిద్దరినీ మదరాసులో దిగబెట్టి, నేను పెషావరుకు వెళ్ళాను.

మా వదినకు జబ్బూలేదు, గిబ్బూలేదు. జెన్నీ తరఫున మా అన్నే రాజీనామా పెట్టాడు. ఆమె గవర్నమెంటు ఉద్యోగానికి ప్రభుత్వంనుంచి విచారిస్తూ, ఆమెకు రాజీనామా అంగీకరించినట్లు ఉత్తరం వచ్చిందట.

ఆమెను ఎక్కడకు పోనీయడు. కొంచెం హెచ్చుతగ్గుగా ఖైదు. ఆమెవెంట ఎప్పుడూ ఎవ్వరో ఉండడం! జెన్నీ అన్నగారి ఉద్దేశం అంతా వెళ్ళిన రోజే గ్రహించింది.

మా డాడీ మా అన్నను మెచ్చుకుంటూ జెన్నీకి బుద్ధి చెపుతూ. పెద్ద ఉత్తరం రాశాడుట.

మూర్తీ! మూర్ఖుల పట్టుదల ఈ ఇరవైయో శతాబ్దములోకూడా ఈలా వుంటుంది. నేను మాట్లాడకుండా మర్యాదగా మాట్లాడినట్లు నటించి, ఒక రోజున షికారు వెళ్ళినట్లు బయలుదేరి మా జెన్నీని రైలు ఎక్కించి లాహోరు అక్కడనుంచి తిరుచునాపల్లి పొమ్మని పంపాను.

ఈ సంగతి ఆ అన్నకు తెలిసి ముష్టియుద్దం సలిపినాడు. దెబ్బలన్నీ తిని నేను అహింస అవలంబించితిని. మొగం వాచి పెదవి పగిలి పడిపోయాను. మా వదిన అడ్డం రాకపోతే మా అన్న ఎంతవరకూ వెళ్ళేవాడో! మా వదినే నాకు కట్టుకట్టింది.

ఈలోగా మా అన్న సాయంకాలం బండిమీద బయలుదేరి ఎలా గ్రహించాడో జెన్నీ ఢిల్లీలో ఉంటుందని అక్కడకు పోయి ఆమెకు బలవంతంగా రైలు ఎక్కించి తిరిగి పెషావరుకు తీసుకువచ్చాడు. ఇప్పుడు జెన్నీ ఆ ఇంట్లో ఖైదు. నేను ఒక ఇంగ్లీషు హోటలులో మకాం.

ఇంక నేను చేయబోయేది; మా అన్న సంగతి ముఖ్య సైనికోద్యోగికి తెలిపి జెన్నీని తీసుకుని నువ్వు ఎక్కడ వుంటే అక్కడకు వస్తున్నాను. నేను ఢిల్లీ వెళ్ళి నీ తిరగడం గురించి దర్యాప్తు చేస్తాను.

నా మొగం వాపూ అవీ తగ్గినాయి. ఏ సంగతీ వెంటనే ఉత్తరం వ్రాస్తాను.

ప్రియమైన

లయొనెల్.

ఈ ఉత్తరం చదువుకొన్నాడు. తెల్లబోయాడు. మళ్ళీ చదువుకొన్నాడు. కన్నుల నీరు తిరిగినంత అయింది. తన కోసం తన ప్రాణ స్నేహితుడూ, తన ఆత్మదేవి అంత బాధ అనుభవించారు. అతడు కోపంతో మండిపోయాడు. పళ్ళు బిగించాడు. ముష్టితో బల్ల కదిలిపోయేటట్లు గుద్దినాడు.

అడివి బాపిరాజు రచనలు - 7

70

నరుడు(సాంఘిక నవల)