పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మిస్టర్ కార్లయిల్‌గారు ఎంతో చక్కగా ప్రతిభతో ప్రభుత్వానికి భక్తితో పనిచేసి వుండడంచేత ఎం.ఎస్.ఎం. రైల్వేవారికి చీఫ్ యింజనీరు అయిన రెండేళ్ళకు 1924వ సంవత్సరంలో “నైటు బిరుదం పొంది సర్.ఎడ్వర్డు కార్లయిల్‌గారు కె.సి.ఐ.” అయ్యారు.

వీరిని ముఖ్య ఇంజనీరును చేయడంలో ప్రభుత్వంవారు రెండు పక్షుల్ని ఒకే బాణంతో కూలవేయగలిగారు సర్. ఎడ్వర్డు కార్లయిల్‌గారు భారతీయుడు. అందుకని ఆయనకే ఈ ఉద్యోగం ఇచ్చాము” అంటూ మొగం అవతలికి తిప్పి “ఎల్లాగైనా ఆంగ్ల రక్తం ప్రవహించేవానికి ఆ మాత్రమయినా చేయకపోతే యెల్లాగు” అని ఒకరినొకరు కళ్లు గీటుకున్నారు.

సర్. ఎడ్వర్డు కార్లయిల్‌గారు ఇంటికి వచ్చారు. వస్తున్నామని తెలియజేయగానే జెన్నిఫర్ తల్లిదండ్రులను ఎదుర్కోవడానికి వెళ్ళింది. ఉండే పరిస్థితులలో ఎల్లమందమూర్తి వచ్చి జెన్నీ తల్లితండ్రులను వివాహానికి అనుమతి అడగడంకన్న, తానే తన మాతా పితరులను ఒప్పించడానికి నిశ్చయం చేసుకొంది.

ఎల్లమందమూర్తి తన స్వగ్రామం వెళ్ళిపోయినాడు.

ఎల్లమందమూర్తి తన స్వగ్రామం వెళ్ళడానికి నిశ్చయించుకున్న రోజు సర్. ఎడ్వర్డు కార్లయిల్ వచ్చిన ముందురోజు. ఆ దినం ఒక్క నిమిషం విడవకుండా అతడు, జెన్నీ తిరిగారు.

“జెన్నీ! ఈ మానవ వ్యవస్థ చాలా విచిత్రమయినది. లోకంలో వున్న స్త్రీ పురుషులు నూరుకోట్ల సంఖ్య. అందులో ప్రేమించటానికి సిద్ధంగా వున్న వారి సంఖ్య కొద్ది కోట్లు అయినా ఈ ప్రేమల పరిణామం, పరిణత, చరిత్రా ఏ రూపాలు పొందుతాయో ఆలోచిస్తూ ఉంటే నాకు 'ఫాఘ్ట' చూచి దిగ్భ్రాంతుడయిన బ్రహ్మాండము కనబడుతూ వుంటుంది.”

“నీకు ఎప్పుడూ ఆలోచనలే, కార్య నిమగ్నత తక్కువ ప్రియతమా?”

“అవును, నీ అద్భుత మూర్తిని సందర్శించిన యువకుడు పనిలేనివాడై లోకం అంతా తిరుగుతూ వుంటాడు.”

“లోకంలో ఉన్న యువతీమణులు ఎన్ని జాతులవారు, ఎన్ని దేశాలవారు యెంతెంత అందంగా ఉన్నవాళ్ళు లేరు?”

“అది నిజమే. సౌందర్యశాస్త్రం ప్రకారం అందం కలవాళ్ళు ఒక జాతి అనుకుందాం. ఆ జాతిలో అంతరమయిన జాతులకు చెందిన సౌందర్యవతులను, ఒకరకం మానసిక ప్రవృత్తిగల యువకులు ప్రేమిస్తారు. అందులో ఒక్కొక్క అనుభూతి కారణాలవల్ల ఈ మనుష్యుడూ, ఈ స్త్రీ అని కేటాయింపయివుంటారు. ఆ కేటాయింపయిన జత మనం ఇద్దరం కాబోలు.”

“నీ మాటలు అగమ్యగోచరంగా వున్నాయి.” అని పకపక నవ్వుతూ జెన్నీ అతన్ని గట్టిగా అదుముకొంది.

“జెన్నీ, కొన్ని యుగాలు నిన్ను వదిలివుండాలి!”

ఆ రాత్రి మెయిలు మీద భీమవరం వెళ్ళిపోయినాడు ఎల్లమందమూర్తి.

అడివి బాపిరాజు రచనలు - 7

47

నరుడు(సాంఘిక నవల)