పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాట్యంలోనుండి నెమ్మదిగా హోటలు తోటలోనికి చేరారు. జెన్నీ కళ్ళు నక్షత్రాలులా మెరుస్తున్నవి. అద్భుత సౌందర్యవతి యని పేరుగన్న ఆ బాలిక ఈ సమయంలో సౌందర్యానికే సౌందర్యం దిద్దే సౌందర్య సంపూర్ణ అయింది.

ఇద్దరు కొంచెం చీకటి ఉన్న ఓ పూపొదరింటి మాటున వేయబడిన సోఫాలో చదికిలబడినారు. ఇద్దరికీ మాటలు లేవు. జెన్నీ అతని భుజాలపై రెండు చేతులువేసి “మూర్తి, నేనే నిన్నే... ప్రేమిస్తున్నానని... తెలుపుతున్నాను. నువ్వూ నన్ను ప్రేమిస్తుంటే నన్ను - నా పెదవుల్ని ముద్దు పెట్టుకో!” అని మధురమయిన వాక్యాలు పలికింది.

4

ఆ వాక్యాలు అస్పష్టంగానే! అతడు ప్రేమ ఎరగడు. స్త్రీలను వాంఛించకపోలేదు. కాని తన వ్రతం చొప్పున పరదేశాలలో ఉన్నప్పుడు బాలికల జోలికిపోలేదు. నాట్యం నేర్చుకొన్నాడు. ఇంగ్లీషు బాలికలతో నాట్యం చేయడం నేర్చుకున్నాడు అంతే! అతన్నీ కొందరు బాలలు కోరారు. అతడు తల్చుకుంటే పొందు కూడడానికి అదనులు దొరక్క పోలేదు. కాని త్రాగుడును ఏలా అతిదూరంగా ఉంచేశాడో, అలాగే స్త్రీ తోటి సంబంధాలు అతి దూరంగా ఉంచేశాడు.

పైకి కనబడేవారి తెలుపురంగు ప్రవహించే గులాబీ రంగులు ఎల్లమందకు గుండె కొట్టించిన మాట నిజమే! కాని తన జాతి నల్లరంగు, తన జాతి గుడిసెలు; తన జాతి వాడలు, దుర్గంధము, దుర్భరస్థితి, మురికిగుడ్డలు, కుళ్ళిన మాంసము, చదువులేని తనము నాగరికతలో అది ప్రాథమిక స్థితి - అతనికి అలాంటి సమయాలల్లో మరింత భయం కొలిపేవి. అతడు వణికిపోయేవాడు.

తన సంఘంకన్న హైన్య స్థితిలోవున్న సంఘాలు ప్రపంచమంతా ఉన్న మాట నిజం! మంచి స్థితిలో ఉన్న సంఘాలు వాని ప్రయత్నాలమీదనే అవి ఉన్నతస్థితికి రాగలిగాయి. కాని ఆఫ్రికాలో నీగ్రోలు, అండమాన్సు నూజిలాండు, బోర్నియాలలోని ఆదిమవాసులు తన భారతదేశములో తన సంఘంవలె ఉండే ఇతర సంఘాలు, నాగులు, వేప్చాలు, శబరులు, చెంచులు, యానాదులు, భంగీలు, పెరయాలు, మాలమాదిగలు, డోంభీలు, చచ్చటివాళ్ళు, వోర్లీలు, బిల్లులు కోతులు, గోండులు, సంతాలులు వీరందరి స్థితీ! బర్మాలో వారిస్థితీ! వీరందరూ అలాంటి పరమ హైన్య దశలో విముక్తి లేకుండా ఉండిపోవలసినదేనా? అని ఎల్లమందకి జెన్నీ ఎదుట కూర్చుండి ఆమెను దగ్గిరగా తీసుకొన్న ఆనందంలో, ఆమె తన్ను ముద్దు పెట్టుకోమని అడిగిన ఆనందంలో ఒళ్ళు ఝల్లుమంటుండగానే ఈ ఆలోచన అతన్ని విద్యుచ్ఛక్తిలా ఆవరించుకొంది.

కాని, అతని దేహాన్ని హృదయాన్ని జీవితాన్ని అలుముకొని ఉన్న గాఢపిపాస ఒక్కసారిగా ఉప్పొంగిపోయింది. అతడు జెన్నీని అతిక్రాంతాలింగనంలో అదిమికొని ఆమె పెదవులను మహోద్రేక చుంబనాన అదిమి వేసినాడు.

ఆ యిరువురికీ సర్వప్రపంచమూ మాయమయినది. వారిరువురూ ప్రపంచానికి, కాలానికీ అతీతమైపోయినారు. కాలమే ఆగిపోయినది!!


అడివి బాపిరాజు రచనలు - 7

40

నరుడు(సాంఘిక నవల)