పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చీటి ఇచ్చినాడు.వారు కూచోండనీ కార్యదర్శిగారు పని ఉండి రాలేకపోయారనీ, అయిదు గంటలకు వస్తారనీ చెప్పారు. వారిని మళ్ళీ దర్శనం చేసుకొంటానని చెప్పి అక్కడ సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయినాడు. సరిగా అయిదు కొట్టేసరికి జెన్నిఫర్ ఇంటి గుమ్మం మూర్తి ఎక్కినాడు.

3

వెళ్ళగానే జెన్నీగారి సేవకుడు, ఎల్లమంద టోపీ అంది పుచ్చుకున్నాడు. జెన్నీగారి తల్లి, తండ్రి గ్రామాంతరం వెళ్ళారని, లయొనెల్, అతని భార్య జెన్నీకి అతిథులుగా ఉన్నారనీ జెన్నీ ఎల్లమందమూర్తికి చెప్పింది. లయొనెల్, ఎలిజబెత్తులు వీరిరువురు కూర్చున్న కడకు వచ్చారు. మూర్తి నమస్కరించాడు. తేనీరు అయిదున్నరకు, ఆ తర్వాత నలుగురూ కలిసి వెస్ట్ఎండ్ సినిమాకు వెళ్ళి అక్కడ ప్రదర్శితమవుతున్న మంచి చిత్రం ఒకటి చూడడం, తర్వాత నలుగురూ కానుమెరా హోటలులో మూర్తికి అతిథులుగా భోజనం చేయడం, భోజనం ముందు నాట్యం. ఆ రోజు కానుమెరాలో నాట్యదినం. నాట్య కార్యక్రమం తెల్లవారగట్ల రెండు మూడింటివరకూ సాగుతుంది. ఇది మనవారి కార్యక్రమం.

నలుగురూ హాలులో కూచుని చెకచెక కబుర్లు చెప్పుకుంటున్నారు. మూర్తిచేత జెన్నీ చక్కని ప్రోత్సాహం ఇస్తూ మాట్లాడిస్తున్నది. అతని స్వప్నాలు ఆశయాలు చిన్ననాటి స్థితి మొదలయిన విషయాలు సినిమా బొమ్మల్లా వాళ్ళ హృదయావనికలపై దృశ్యమై మాయమైపోతున్నవి.

మూర్తి: మా ఇళ్ళలోకి దూరి వెళ్ళాలి!

జెన్నీ: సముద్రం ఒడ్డున పల్లెవాళ్ళ ఇళ్ళలా!

మూర్తి: పల్లెవాళ్ళ ఇంటికి పెద్దకులం వాళ్ళెవరయినా రావచ్చును. ఇంట్లో ప్రవేశించి కూచోవచ్చు.

జెన్నీ: మీ ఇళ్ళకు ఎవరూ రారు మూర్తిగారూ!

మూర్తి: నన్ను గారూ, గీరూ అనకు జెన్నీఫర్!

జెన్నీ: అయితే నువ్వు నన్ను జెన్నీఫర్ అనే పేరుతో పిలవకు 'జెన్నీ' అని పిలువు.

మూర్తి: అలాగే! మా గరువుగారి కొమరిత పేరు 'జోను' నన్ను 'జో' అని పిలవమనేది. అలాగే పిలిచాను.

లయనెల్: గురువని 'మాక్ పెరని' పిలుస్తువా మూర్తి!

మూర్తి: అవును “లయ!”

తేయాకు నీరు త్రాగినారు. ఎంతో సంతోషంతో కాలం గడిచిపోయింది.

ఎలిజబెత్తు జెన్నీలు సినీమాకై దుస్తులు మార్చుకొనడానికై వెళ్ళారు. మూర్తి లయొనెల్ సిగరెట్లు త్రాగుతూ కూచుంటే, లయనెల్ తన ఉద్యోగం విషయం అంతా మూర్తికి చెప్పినాడు.

వారంతా కలిసి సినిమాకు వెళ్ళినారు. జెన్నీ మూర్తి ప్రక్కనే కూచుని ఉంది.

ఈ మూర్తి నలుపు. తన చక్కని గులాబి రంగు ముందు మూర్తి నలుపు రాక్షసి బొగ్గు నలుపు. ఆమె వీళ్ళంతా ఒకనాడు నీగ్రోజాతి వారేమోననుకుంది.


అడివి బాపిరాజు రచనలు - 7

38

నరుడు(సాంఘిక నవల)