పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎలిజబెత్ నవ్వుతూ, “మీ ఇండియా, రంగుల సౌభాగ్యాల సౌరభాల దేశమయ్యా! నాకు ప్రథమ పరిచయం ప్రేమ, ద్వితీయ పరిచయంతో గాఢ ప్రణయమే ఉద్భవించింది.” అని అన్నది.

లయొనెల్ జెన్నీని చూపిస్తూ, “ఈ అల్లరి అమ్మాయి ఎవరో ఆనవాలు పట్టగలవా?” అన్నాడు.

“అల్లరి అమ్మాయినే ఆనవాలు పట్టాను.” అని ఎల్లమంద చిరునవ్వుతో అన్నాడు.

“మా జెన్నిఫర్! జెన్నిఫర్!! ఈమే మూర్తీ!” అని వారిరువురను ఎరుకపరిచారు. ఎల్లమందకు ఆమె చేయి ఇచ్చింది. ఇద్దరూ కరస్పర్శ కావించుకున్నారు. మాటలు లేవు. ఇద్దరూ ఒకరికొకరు తీక్షణంగా చూచుకున్నారు. ఎల్లమంద గుండె అతివేగంగా కొట్టుకొన్నది. ఆమె హృదయమూ ఎందుకో వేగంగా కొట్టుకొంది. తెప్పరిల్లి జెన్నీ “అమెరికానుంచేనా మీరు వస్తున్నది?” అని ప్రశ్నించింది.

ఎల్ల: దారిలో జపానులో పదిహేను రోజులు ఆగి ఆ దేశంలోని ఇంజనీరింగు విధానాలన్నీ పరిశీలించాను.

జెన్నీ: 'దయబుటూ'ను చూచారా?

ఎల్ల: దివ్య బుద్ధ విగ్రహం పరమ సౌందర్యవంతంగా ఉంది. అలాంటి విగ్రహాలు ఆ రకంగా మన దేశంలో లేవు. అయినా ఈ భావం మన దేశంనుంచే జపాను వెళ్ళిందని ఆశ్చర్యము పొందాను.

ఎలిజ: మొన్న మేము శ్రావణబెలగోలా వెళ్ళి బ్రహ్మాండమయిన విగ్రహాన్నొకదాన్ని చూచివచ్చాము.

ఎల్ల: దాన్ని గురించి విన్నాను.

లయొ: మా విజ్జీకి ఎల్లా తెలిసిందో నేను చార్జీ పుచ్చుకొని మా ఇద్దరి కాపురం తిరుచునాపల్లిలో పెట్టిన వారం రోజులనుంచీ శ్రావణబెలగోలా వెళ్ళాలని పట్టుపట్టింది.

ఎలిజ: ఏముంది, నేను హిగిన్‌బాదమ్స్‌లో యాత్రికుల గ్రంథాలన్నీ కొన్నాను.

వారందరూ పోయి టాక్సీ కారులో ఎక్కారు. కస్టమ్సు వారు ఎల్లమంద మూర్తి వస్తువులు తనిఖీచేసి, వేయవలసిన వానికి పన్ను విధించి ధనం తీసుకొని రశీదులు ఇచ్చినారు. సామానులన్నీ ఒక టాక్సీలోవేసి రెండవదానిలో తామెక్కి అంతా కానుమెరా హోటలుకు చేరారు.

ఎల్లమందకు ఇంగ్లీషు హోటల్లో ఉండడానికి ఇష్టం లేదు. అతన్ని ఎదుర్కొనడానికి వీళ్ళు ముగ్గురూ తప్ప ఇంక ఎవ్వరూ రాలేదు. హరిజన సేవాసమితి కార్యాలయానికి వచ్చి తెలుసుకోవలసినదని, “కానుమెరా'కు ఉత్తరం వచ్చింది.

అతన్ని అక్కడ వదిలి లయొనెల్ ఎలిజబెత్, జెన్నీలు తమ ఇంటికి పోయారు. జెన్నీకి ఛాంపేను త్రాగినట్లు ఏదో హుషారుగా ఉంది. ఎల్లమందమూర్తి భోజనంచేసి కాసేపు విశ్రాంతి తీసుకొని, సాయంకాలం అయిదుగంటలకు జెన్నీగారి ఇంటికి తేనీటికి వెళ్ళ నిర్ణయమైంది.

నాలుగు గంటలకు వేషం వేసుకొని టాక్సీ చేసుకొని, మూర్తి హరిజన సేవా సంఘ కార్యాలయానికి వెళ్ళినాడు. అక్కడ పనిచేసేవారికి మూర్తి తన విలాసం ఉన్న


అడివి బాపిరాజు రచనలు - 7

37

నరుడు(సాంఘిక నవల)