పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎల్లమందమూర్తి ఈ స్వప్నప్రపంచంలోంచి ఒక్కసారిగా కూలబడుతూ ఉంటాడు. తన దేశంలో ఇలాంటివి ఎవరు చేయిస్తారు. ఇంగ్లీషువారికి ఏమి పట్టింది. మహాత్ముని ఉద్యమం భారతదేశానికి స్వరాజ్యం తీసుకువస్తే ఆదేశంమీదకు ఇతరులు రాకుండా ఉంటే చిక్కిన తన దేశ ప్రజలు వందల సంవత్సరాలనుంచీ పోయిన బలాన్ని తిరిగి సంపాదించుకొని ఛాతీలు విరిచి పనిచేయగలిగేసరికి మళ్ళీ ఎన్ని వందల సంవత్సరాలు పడుతుందో?

ఎల్లమంద లోకమంత నిట్టూర్పు విడిచాడు. అమెరికా అంతా గురువుగారి సహాయంవల్ల తిరిగి మహోత్తమ యోగ్యతా పత్రము పుచ్చుకొని ఎల్లమంద స్వదేశాభిముఖుడైనాడు. అతడు తాను వస్తున్నానని హరిజన సంఘం వారికి, తన మిత్రుడు లయనెల్‌కూ, తన గ్రామంలో తండ్రికీ తల్లికీ ఉత్తరాలు రాసినాడు.

ఎల్లమంద ఇంగ్లండులో చదువుకుంటున్నాడు. ఎల్లమంద అమెరికాలో ఉన్నాడు. జక్కరం గ్రామంలో మాదిగవాడలో ఎల్లమంద తండ్రీ తల్లీ అన్నతమ్ములూ, అక్క చెల్లెండ్రూ, చుట్టపక్కలూ ఆ గుడిసెలో, ఆ వాసనలో ఆ మకిలిలో, ఆ చినిగిన గుడ్డల బీదతనంలో, ఆ తిండిలేని ఆకలి హీనతలో, అలాగే ఒకరకం ఆనందంతోనే కాలం గడుపుతున్నారు.

ఆ ఆనందం ఏమి ఆనందం అని ఎల్లమందమూర్తి పళ్ళు బిగించి అనుకున్నాడు. తన వాళ్ళకు ప్రయత్నం చేసే శక్తిలేదు, జ్ఞానమూలేదు, ప్రయత్నం చేయాలన్న భావమూ లేదు. మహాత్ముని పవిత్ర శంఖారావంలో స్వరకల్పన, తాళము, ఆనందమూ, వాళ్ళ పల్లెలకు వినబడుతుందా?

2

ఎల్లమంద బాగా పొడుగ్గా ఎదిగి అయిదడుగుల పది అంగుళాల ఉన్నతి సంపాదించుకొన్నాడు. దేహం ఒక స్వచ్ఛత పొందింది. జ్ఞానం అతని మెదడు తలాల్లో నిత్యజీవ పవిత్రగంగా ఘరీ వేగంతో ప్రవహిస్తున్నది.

చక్కని అమెరికను దుస్తులతో అమెరికన్ వేషంతో ఎల్లమంద జపాను ఓడలోంచి దిగేసరికి లయొనెల్, లయనెల్ భార్య ఎలిజబెత్తూ, జెన్నిఫర్ నవ్వుతూ ఎదురు వచ్చారు. లయొనెల్ చేతులు చాచి వచ్చి ఎల్లమంద చేతులు గట్టిగా పట్టుకొని జాడించాడు. ఎల్లమంద సంతోషం వర్ణనాతీతమే! ఎల్లమంద లయనెల్ భార్యను బాగా ఎరుగును. ఎలిజబెత్ కూడా “మూర్తి” అంటే ఎంతో స్నేహంగా ఉండేది, ఇంగ్లండులో. ఇంక మూర్తీ కళ్ళ ఎదుట ప్రత్యక్షమయిన దివ్య సౌందర్య నిధి ఎవరూ?

ఒహో! ఒక్క నిమిషంపాటే అనుకో, అతడు ఆనవాలు పట్టలేక పోయాడే! ఈ బాలిక జెన్నీ! అన్నగారి హృదయం చూరగొన్న మురిపాల చెల్లెలు జెన్నీ! లయనెల్ అన్ని పొగడ్తలు ఈ బాలికవే! ఎంత అందమయిన బాలిక! సన్నగా బంగారు శలాకులా, మళ్ళీ తగిన బలంతో పొట్టిగా ఉన్న ఈ బాలిక అపశ్రుతి ఏమీలేని సౌందర్యాల నిధి!

ఎల్లమంద లయనెల్ భార్య ఎలిజబెత్తుకు, టోపి తల పైన నుండి తీసి నమస్కరించి కరస్పర్శచేసి, “ఎలిజబెత్! నీకు మా భరత భూమి కూడా బాగా సరిపడిందిలా ఉందే! నీ ఇంగ్లీషు గులాబులు ఇండియా ఎండలకు ఏమీ తగ్గలేదు.”


అడివి బాపిరాజు రచనలు - 7

36

నరుడు(సాంఘిక నవల)