పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ భాగం

నరుడు - నారీ

మెరికా నుండి ఎల్లమందమూర్తి దిగినాడు మదరాసులో. టెన్నిసీ లోయల ఆనకట్టల విధానం సమగ్రంగా చూడడమే కాక అక్కడ పెద్ద ఇంజనీరు దగ్గర రెండేళ్ళు విద్యార్థిగా పని నేర్చుకునేవానిగా పనిచేశాడు. ఆ ఇంజనీరు “మాకు ఫర్టను” ఇంజనీరు శాస్త్రంలో ఉద్దండ పండితుడు.

లోకంలో వర్షం వల్ల ఎంత నీరు పడుతోంది; ఒక్కొక్క నది ఎంత నీరు మోసుకుపోయి సముద్రంలో కుమ్మరిస్తోంది. ఆ నీరు తీసుకుపోతూ, నీటితోపాటు మన్నూ కొట్టుకుపోతుంది. ఊళ్ళు కొట్టుకుపోతాయి. పొలాలు తేలుకుపోతాయి. ప్రతి నదీ ఈనాడు ఈ దారిని, ఆనాడు ఆ దారిని పోతుంది. వరదలు, ముంపులు, పంటనాశనం, మనుష్యుల ప్రాణనాశనం, పశువుల నాశనం, రోడ్లు, రైళ్ళు నాశనం!

ఈలాంటివి భారతదేశంలో నిత్య ప్రళయ తాండవ దృశ్యాలు. ఓనాడు గోదావరి, ఇంకో సంవత్సరం కృష్ణ, ఆ మరుసటి ఏడు గంగ, శోణానది, గండకి, బ్రహ్మపుత్ర వరదలు, వరదలు.

కోట్ల కోట్ల గుండిగెల నీటిని నిష్కారణంగా కళ్ళారా చూస్తుంటే దిగమ్రింగడంలో దాహం ఏ మాత్రమూ ఎప్పుడూ చాలని ఆ బ్రహ్మాండ వృకోదరుడు సముద్రుడు తాగిపారేస్తున్నాడు. ఆ నీరు మనకు వద్దా అండీ అని ఎల్లమందమూర్తి అనుకున్నాడు. తాగడానికి కావాలి. పొలం తాగడానికి కావాలి! విద్యుచ్ఛక్తి ఉద్భవింపచేయడానికి కావాలి.

గోదావరికి ఎన్ని ఆనకట్టలు కట్టవచ్చును? ఆ దివ్యమాత సముద్రతలానికి మూడువేల అడుగులకు పైన ఉద్భవించింది. ప్రతి నూరు అడుగులు దిగడంలోనూ ఒక ఆనకట్ట కడితే, కామధేనువు నందినీవత్సానికి పాలు చేసినట్టు ప్రాణయస్సులు చేసి ఉండును. ఒక్కొక్క ఆనకట్ట ఒక్కొక్క పొదుగు. ముఫ్ఫై ఆనకట్టలు! నాసిక ప్రతిష్టానం. నాందేడు, గ్రామమందెన గ్రామం, భద్రాచలం, పోలవరం, ఈలా ఆ తల్లికి ఆ తల్లి లోనికి ప్రవహించే నదులకు ఆనకట్టలు! ప్రపంచమంతా నూత్న జీవంతో ఫక్కుమనదూ? అప్పటికీ ఎల్లమంద తెలిపే లెక్కల ప్రకారం గోదావరి నీటిలో నూరోవంతే ఉపయోగం అయ్యేది.

ఆనకట్టలు, కాల్వలు, వేలకొలది కాల్వలు, కాల్వలపై కాల్వలు, వంతెనలు, కాల్వలు దేశం అంతా జీవన రక్తనాళ పూర్ణమయిన మహాశరీర మయిపోతుందని టెన్నిసీలోయ చూస్తూ ఎల్లమంద స్వప్నాలు తేలినాడు.

వరదలు అలంకరించుకొన్న అప్సరసలులా దేశాల ప్రవహించిపోతాయిగాని ఎంతమన్నో భూములలో నిలుస్తుంది. భూదేవి గర్భం చల్లబడుతుంది. భారతదేశం నలభైకోట్ల పుత్రులను కాదు, నాలుగువందల కోట్ల పుత్రికా పుత్రకలను భరించ గలుగుతుంది.


అడివి బాపిరాజు రచనలు - 7

35

నరుడు(సాంఘిక నవల)