పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“మీ చెల్లి వైద్య కళాశాలలో చదువుతోంది కాదూ లయొనెల్?” అన్నాడు.

“అవును నాయనా! అందంలో మా చెల్లి ఎదుట నిలువగల బాలిక ఈ ప్రపంచంలో లేదు. ప్రపంచమందు పందెం వేస్తే మా జెన్నీ మిస్ ప్రపంచం అయి తీరుతుంది.”

“నువ్వన్న మాటల్లో అసత్యం ఏమీలేదు. ఛాయా చిత్రమే ఈలా ఉంటే, అసలు ఆ బాలిక-”

“నీ మతి మాయమంత్రం చేస్తుంది.”

"మీ చెల్లెలు.”

“చెప్పూ -”

“మీ చెల్లెల్ని మనం ఇండియాకు వెళ్ళగానే దర్శనం చేసుకోవాలి!”

“ఈలా మా సంభాషణ జరిగింది జెన్నీ!” ఈ ఉత్తరం పదిసారులు చదువుకుంది. తర్వాత చదువులో నిమగ్నురాలయింది.

ఆ రాత్రి ఆ బాలిక కాలేజీనుంచి వచ్చి పుస్తకాల బల్ల ముందర కూర్చుంది. మనస్సు పాఠశాలమీదకు పోదు. ఏదో ఆవేదన! తనకు ఇరవై రెండేళ్ళు జరిగి ఇరవై మూడవ సంవత్సరం వచ్చింది. తాను అందంగా ఉన్నానని ప్రతి మగవాడూ భట్రాజులా పొగడుతాడు. ఈ అందం శరీర శాస్త్రపరంగా చూస్తే ఏముంది? వృక్షశాస్త్ర పరంగా మనం తినే కాయగూరలు ఏమున్నాయి? అయినా అవి సేవిస్తూంటే భోజనం ఎంత ఆనందంగా అనుభవించడం లేదు. జీవితం నిండి జీవితాన్ని అధిగమించిన ఏదో ఒక అనుభూతి మనుష్యులను కదిలించి వేస్తూ ఉంటుంది.

తన జాతి స్థితి ఏమిటి? బ్రిటిషు ప్రభుత్వం ఎంత కాలం ఈ దేశం పరిపాలిస్తూ ఉంటుందో, అంతకాలం పశు శరీర సౌందర్యం కల తనబోటి యువతులకు తెల్లసైనిక మిండగాళ్ళకు కొదువలేదు. ఆ మగ పశువులను ఆకర్షించే ఆడ పశువులుగా తన జాతి స్త్రీలు తయారై తన జాతిని ఎంత నీచగతిలోకి తీసుకువచ్చారు.

అటు ఎల్లమందమూర్తి కులం ఆడవాళ్ళు తనజాతికి తల్లులైతే, ఇంగ్లండునుండి వచ్చిన తెల్ల పశువులు తన జాతికి తండ్రులయ్యారు. ఇదేస్థితి బర్మాలో, మలయాలో, జావాలో, ఇండోచీనాలో, ఆఫ్రికాలో, సర్వదేశాల్లోనూ అటు యూరపుకూ చెందక, ఇటు ఆసియాకు చెందక అతి నీచజాతి ఓటి ఈ ప్రపంచంలో ఉద్భవించడానికి కారణం తనబోటి నీచ స్త్రీలు. ఆమె కంటివెంట అశ్రుబిందువులు జలజలా ప్రవహించినాయి.

ఈ నిర్వేదనానికి కారణం అన్నగారు వ్రాసిన ఉత్తరం! ఎల్లమందమూర్తి భారతీయ హిందువులలో అతి నీచస్థితిలో వున్న ఒక కులానికి చెందిన బాలకుడు. అతడు చదవడానికి ఎలా ఏర్పాటయింది. అతడే చదువుతున్నాడా? అతని ఊరేది? జిల్లా ఏది? అతని చదువు అతన్ని ఇంగ్లండుకు ఏలా తీసుకువెళ్ళింది. అతనికి ధనం ఎవరిస్తున్నారు?

ఈలాంటి సంగతులు తన జాతివారు ఎవ్వరూ ఆలోచించరు. తాము భారతీయులము కామనుకుంటారు. ఆంగ్లేయులు కాలేరని తమవారికే తెలుసును. తాము బానిసలము, అధోగతిలో ఉండవలసిన వారము, అసభ్యమైన మాట లేకుండా మాటలాడలేనివారం, చదువు లేనివారం. రైల్వే ఉద్యోగాలూ, మదరాసు పోలీసు సార్జంటు ఉద్యోగాలు ఇలాంటివి తప్ప తమకు ఇంకో రాజకీయాలు లేవు. ఈ హిందూ దేశంలో

అడివి బాపిరాజు రచనలు - 7

27

నరుడు(సాంఘిక నవల)