పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండవ భాగం

వైద్య విద్యార్థిని


బాలిక వైద్య విద్యార్థిని. మూడవ సంవత్సరం చదువుతోంది. అసలయిన యురేషియను జాతికి చెందిన ఉత్తమ వంశీకురాలు.

క్లైవు పరిపాలించిన రోజులలో ఇంగ్లండునుంచి దిగిన బ్రిటిషు యుద్ద భటులు కర్కోటకులు. వారి నాయకులు కొంచెం పెద్ద కుటుంబాల వారైనా, ఇంగ్లండులో ఎందుకూ పనికిరాక, తమ కుటుంబాలకు వేరుపురుగులుగా పరిగణింపబడి, చుట్టాల అభిమానం, వాని పలుకుబడులవల్ల హిందూ దేశానికి వెళ్ళే యుద్ద సైనికులకు నాయకులుగా వచ్చిన పిట్టపిడుగులు.

ఆ పిట్టపిడుగులకు నాయకుడు క్లైవు. క్లైవుకు కుడి భుజం మేజరు రిచ్చర్డు కార్లయిలు. మేజరు రిచ్చర్డ్ కార్లయిలు ముష్టియుద్ధంలో అందెవేసిన చేయి. ఆనాటి ఇంగ్లండులో అయిదు కౌంటీలకు ఏకైక విజయంగా బహుమానాలు పొందినవాడు. అతని పేరు అతని తలిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, దగ్గిర చుట్టాలు ఎవ్వరూ ఉచ్చరించేవారు కారు.

మేజరు రిచ్చర్డ్ మందతప్పిన గొర్రెకాడు. గొర్రెల్లో చీంబోతు. విజయ విలియంరాజు కాలంనాటి నుంచీ ఇంగ్లండులో ప్రసిద్ధి కెక్కిన మధ్య కౌంటీల రైతు కామందుల కుటుంబాలకు అపఖ్యాతి తెచ్చిన నల్లగొర్రె చీంబోతు. రైతు ఖామందులు (ఇయోమెన్) ఇంగ్లీషు జాతికి వెన్నెముకలు. అలాంటి మేజరు రిచ్చర్డ్ కెఫ్తానుగా హిందూ దేశానికి వచ్చాడు. ఆర్కాటు వగయిరా యుద్ధాల్లో నిరుపమానమైన విక్రమం చూపించాడు. ఒక ఉత్తమ ముస్లిం రాజకుటుంబంలోని బాలికను పెండ్లాడి హిందూదేశంలోనే ఆస్తి సంపాదించుకొని ఉండిపోయాడు.

ఆ వంశంవారు ఉత్తమ యూరేషియన్ జాతి వారయ్యారు. ఈ వంశంలోని బాలికలు కొందరు అసలు ఇంగ్లీషు భర్తలను చేసుకొని ఇంగ్లండు కూడా వెళ్ళారు. పురుషులు హిందువులలో క్రైస్తవమతం పుచ్చుకొన్న ఉత్తమ కుటుంబాలవారి బాలికలను చేసుకొంటూ వర్తకము, ప్రభుత్వోద్యోగాలు, రైల్వే ఉద్యోగాలు చేస్తూ మంచి చదువులు చదువుకుంటూ పేరు పొందారు.

వారికి హిందువులకన్న, ముస్లింలకన్న భారతీయ క్రైస్తవులకన్న భారతదేశం అంటే ఎక్కువ ప్రేమ. మదరాసులో వారికి పదిమేడ లున్నాయి. చాలా చోట్ల భూములు, తోటలూ ఉన్నాయి.

ఆ వంశంలో రైల్వే ఇంజనీయరు ఎడ్వర్డు కార్లయిలు గారి కుమార్తె జెన్నిఫర్ కార్లయిలు ఎంతో అందమయిన బాలిక. ఆంగ్లేయులకన్న స్వచ్ఛమైన తెలుపు కాకపోయినా జెన్నిఫర్ దేహచ్ఛాయ బంగారు సూర్యకిరణాలు హిమాలయ శృంగాలపైన ప్రసరించిన


అడివి బాపిరాజు రచనలు - 7

20

నరుడు(సాంఘిక నవల)