పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నరసింహమూర్తి మేష్టారు మాత్రం ఏదో గ్రహించినట్లు దారి పొడుగునా మాట్లాడుతూనే ఉన్నాడు. ప్లాట్ ఫారం మీద.

“ఏమయ్యా బుచ్చి వెంకట్రావూ! మాకన్న ముందు వచ్చేశావే?” అన్నాడు అందుకు వెంకట్రావు.

“అవును!” అన్నాడు.

“అక్కడ మాయమై ఇక్కడ తేలినావా?”

“అవును!”

కారులో డ్రైవరు పక్క ముందు సీటులో కూర్చుని ఉన్నప్పుడు నరసింహమూర్తి మేష్టారు వెనక్కు తిరిగి చూడకుండానే “నిన్ననే వచ్చేసేయగలిగావన్నమాట బుచ్చి వెంకట్రావూ?” అని ప్రశ్నించాడు.

“అవును!” అని అన్నాడు బుచ్చి వెంకట్రావు.

“విమానంలో భయం వేయదూ?”

“వేయలేదు!”

“రెండు మూడు గంటలలో విమానం రాగలిగిందన్నమాట.”

“ఊఁ !”

హోటలులో “సామానెక్కడ పెట్టించమన్నావయ్యా, బుచ్చి వెంకట్రావూ?” అని నరసింహమూర్తి మేష్టారు ప్రశ్నించాడు.

“అది నీ గది. ఆ గది...”

“సరే సరే!” అన్నాడు మేష్టారు.

ఇద్దరి గదులమధ్య తన గది ఏర్పాటు చేశాడేమిటి? అని నరసింహమూర్తి మేష్టారు దిగులుపడిపోయినాడు. తన కొద్ది సామాను తన గదిలో పెట్టించుకొని, పద్మావతి సామాను పద్మావతి గది అని సైగచేసి చూపించిన గదిలో పెట్టించాడు. గది, గది వెనుక పడకగది ప్రక్కన స్నానాల గది. అందులో వేడినీళ్ళ కుళ్ళాయీ, చన్నీళ్ళ కుళ్ళాయీ ఉన్నాయి. పడక గదులలో, పందిరిమంచం, పరుపూ, శుభ్రమైన రంగుల దుప్పటీ. బీరువా, అద్దం ఉన్న బల్లా, సోఫా, ఓ మంచికుర్చీ..

అందమైన వస్తువులు అలంకరించి ఉన్నాయి. ఇవన్నీ చూచి నరసింహమూర్తి మేష్టారు ఓ నిట్టూర్పు పుచ్చి “నా కెందుకయ్యా ఇవన్నీని?” అని అనుకున్నాడు. పది నిమిషాలు ఏమిటిది? అని తలపై చేయి పెట్టుకొని ఆలోచిస్తూ సోఫాలో కూలబడి కూచుని ఉన్నాడు. ఏదో జ్ఞాపకం వచ్చిన వానిలా తువాలూ, నలుగుపిండీ, నూనె తీసుకొని స్నానాల గదిలోనికి పోయాడు.

రమ్మని టెలిగ్రాం యివ్వగానే వచ్చాడు బుచ్చి వెంకట్రావు. మనస్సు మారింది అని నరసింహమూర్తి మేష్టారు పొంగిపోయాడు. 'హా! వారిరువురకు ఈ విడిగదుల ఏర్పాటేమిటి? వచ్చినప్పటినుండి ఇంతవరకూ వారిరువురకూ మాటలే లేవే? పూర్ణమైన ఆనందంలో మాట్లాడుకోలేకపోయారా? మొదట ఒకరిని ఒకరు చూడగానే వారిరువురి ముఖాలు వికసించాయి. తాను చూడనట్లు నటిస్తూ జాగ్రత్తగా పరిశీలిస్తూనే ఉన్నాడు.

అడివి బాపిరాజు రచనలు - 7

174

జాజిమల్లి(సాంఘిక నవల)