పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇదివరకే తన భార్య ఏ యాత్రకైనా వెళ్ళవచ్చునని బుచ్చి వెంకట్రావు అనుమతి పత్రం వ్రాసి విద్యాలయాధికారిణికి ఇచ్చి ఉన్నాడు. ఆ విషయం తాను బయలుదేర బోయేముందు, పద్మావతి భర్తకు కవరు వ్రాసి పోస్టులో వేయించింది. ఆ ఉత్తరం అతడు రెండురోజులు చూడకుండ అలాగే ఉంచాడు. తర్వాత చూచుకొని ఆశ్చర్యం పొందినాడు.

ఈ యాత్ర ఎందుకు వెళ్ళినట్లు?

తాను యాత్రలకూ ప్రయాణాలకూ వెళ్ళకుండానే ఎక్కడకు చేరుకున్నట్లు?

తనకూ! ఏమి కావాలి?

అనేకులు ధనం సంపాదించుకొనడమే ఆశయంగా పెట్టుకుని, కుమిలి కూలిలి. దొర్లి దోరి, ఆ ధనం సంపాదించుకుంటారు. అలా వారి జన్మంతా ఆ భయంకరయోగంతో నిండిపోతుంది. కాని తనబోటి వాళ్ళకు వ్యక్తంగాని ఏవో కాంక్షలూ, ఆశయాలూ నిండిపోతాయి. వాని స్వరూప జ్ఞానం లేక తాము ఆవేదనలో క్రుంగిపోవడం రోజూ జరిగే నిత్య నాటకం. -

తనకు సుశీల కావాలా? ఆమే తనకు దక్కితే తనకు ఏదో ఆనందం కలుగుతుందా? అంతకన్న అందమైన మలయాళభామినులు ధనం చూపిస్తే తనతో వచ్చి ఉండగలరే! మలయాళీ లేమిటి? ఏ దేశస్థులైనాసరే ధనానికి వచ్చేవారు, అప్సరసలవంటివారు మదరాసులో ఉన్నారు.

"బ్రాతెలు” శాసనం అమలులో ఉన్నా అమలులో లేనట్లే! ఎంతమంది రహస్యంగా ఈ వృత్తి సాగించడం లేదు, అయినా అతి పురుషవాంఛ జీవితానికి ముఖ్యంకాదే! అలాంటి ఆలోచనలే కలుగలేదే! ఈ సుశీల ఏదో అతి విచిత్రమైన బాలిక. ఆమెలో ఏదో అద్భుతమైన ఆకర్షణ ఉంది.

బహుముఖ్యమైన కారణాలవల్ల స్త్రీ పురుషులలో ఆకర్షణ ఉద్భవిస్తుంది. రూప సౌందర్యమూ, అవయవ సౌష్ఠవమా, ఆకారపుతీరూ, కంఠమాధుర్యము, గుణగణాదులు, చేష్టలు ఇంకా ఎన్నో కారణాలుండవచ్చును. సుశీల తనలో పశుత్వభావాలకు దోహదమిచ్చింది.

ఆలోచనలు సముద్రతరంగాలై, పోటు పాటులై ముంచెత్తుకు వచ్చాయి బుచ్చి వెంకట్రావుకు.

తాను సినీమా కంపెనీ పెడుతున్నట్లు పద్మకు తెలియదు. ఆ పెట్టబోయే కంపెనీతో చక్కని చిత్రం తీయాలి. అందులో పద్మ భాగం పుచ్చుకోవాలనికదా తనకోర్కె! కాని సినిమా కంపెనీని స్థాపించి పూనుకోడం ప్రత్యేకం సుశీలకోసం. సుశీల తనకు ఇంకా దగ్గిరగా వస్తుంది. సుశీల కథానాయకురాలు కావాలి. కాని తన భార్య కంఠం ఆ కథలో భాగం కావాలి.

బుచ్చి వెంకట్రావు అనేక సినిమా కంపెనీలు పరిశీలించి చూచాడు. అనేక సినిమా సంస్థలు కుక్కగొడుగుల్లా ఉద్భవించి మరునాడు మాయమైపోతున్నాయి. కొన్ని ఏదో రకంగా తంటాలు పడుతున్నాయి. కొన్ని చచ్చి చెడి చేయంగల విన్నపాలై ఒక బొమ్మ తీసి మాయమైపోతున్నాయి. ఆ బొమ్మ లాభం తెస్తే డిస్ట్రిబ్యూటరు గుంజుకుంటాడు.

అడివి బాపిరాజు రచనలు - 7

160

జాజిమల్లి(సాంఘిక నవల)