పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాజకీయాలు, మతాలు, ఆదర్శాలూ, కాంక్షలూ వివిధ మానవ హృదయ వికారాలూ అతని జీవితాన్ని పొదివికొని పోయినవి.

అడవిలో పెరిగిన పక్షిలావున్న అతడు ఉద్యానవనాల్లో చేరిన మయూరంలా అయ్యాడు. ఈ ధ్వనులూ, ఈ వాసనలూ, యీ గుంపులూ వేరు. అక్కడ ప్రకృతి, ఇక్కడ మానవారణ్యము.

నాలుగవరోజున సుశీలా రాధాకృష్ణ లిద్దరూ అతని ఇంటికి వచ్చినారు. అతడు తెల్లబోయినాడు. అతనికి విపరీతమైన కోపం వచ్చింది. వారితో ఎంతకాలంవరకో అతడు మాట్లాడలేదు. పౌడరు పూసుకున్న సుశీల ముఖాన్ని ఫెళ్ళుమని చెంపపెట్టుతో వికారం చేయాలని అతని మనస్సు గాండ్రించింది. సెంట్లురాసుకుని, లాలిత్యంగా దుస్తులు వేసుకుని ఫ్రేములేని కంటి అద్దాలు ధరించిన రాధాకృష్ణుని ముక్కలుచేసి అతడెక్కి వచ్చిన కారులోనే పోలీసుస్టేషనుకు తానే ఆ కారు తీసుకువెళ్ళి అప్పగించాలన్న తీవ్రక్రోధం వెంకట్రావును ఊపివేసింది.

“వెంకట్రావుగారూ! ఏమిటీ స్థితి? క్షవరం అన్నా చేసుకోలేదు. మా రకం జీవితం మీకు అర్థంకాక కంగారు పడిపోతున్నారు” రాధాకృష్ణ అన్నాడు.

“మీకు మాకూ గాఢమయ్యే స్నేహంలో మొహమాటంలేక రాధాకృష్ణగారన్న మాటలకు మనస్సు చీకాకు పెట్టుకున్నారా? ” అని సుశీల అడిగింది.

వెంకట్రావు మండిపోయాడు. మీ ఇద్దరి స్నేహం నేను కోరలేదు. మీరే నా స్నేహం చేసి నన్ను గడబిడ చేశారు. మీ ఉద్దేశాలు నాకు తెలియవు. మీ విధానాలు నాకు అర్థం కాలేదు. దగ్గిరకు వచ్చినా మీరే, అపార్థాలు చేసుకున్నా మీరే? మీకూ నాకూ స్నేహం లేకపోవడమే మంచిది” అని అతడంటూ పడకగదిలోనికి వెళ్ళి, పక్కమీద మేనువాల్చినాడు.

పది నిమిషాలయిన తర్వాత రాధాకృష్ణ ఒక్కడూ లోనికి వచ్చాడు “వెంకట్రావుగారూ! మీరు ఏది కోరితే అది చేస్తాను, సుశీలను ఇక్కడ వొదిలి పొమ్మంటే వెడతాను. కాని నన్ను గురించి తప్పభిప్రాయం పడవద్దని ప్రార్ధన” అన్నాడతను.

వెంకట్రావు తెల్లబోయాడు. అతడు లేచి రాధాకృష్ణ భుజాల మీద చేయివైచి ఒక్కనిమేషం నిల్చివుండి నిట్టూర్పు విడిచి, మళ్ళీ వెళ్ళి మంచంమీద వాలినాడు. రాధాకృష్ణ మోము ప్రఫుల్లంకాగా, మంచం దగ్గిరకు వచ్చి "నేను రేపు వచ్చి కనబడతాను!” అని ఆవలకు వెళ్ళిపోయినాడు.

సుశీల లోనికి వచ్చినది ఆమె తలవాల్చుకుని గుమ్మం దగ్గర నిలుచున్నది. వెంకట్రావు గుండె గబగబ కొట్టుకుంది. ఆమె రావడమే? అతడు రివ్వున లేచి నిలుచున్నాడు. అతని గుండె రెండు క్షణికాల కాలం ఆగిపోయింది. కళ్ళు మైకం కమ్మినాయి. తల వాల్చుకున్నాడు.

“సుశీ! నువ్వు నాకు చెల్లెలవు. నువ్వు ఇంటికి వెళ్ళు! ఒకరి కొకరం మనం పూర్తిగా అర్థంకాక ఈలా అయింది. ఇద్దరూ ఎల్లుండి రండి” అన్నాడు. సుశీల నెమ్మదిగా . వెళ్ళిపోయింది.

అడివి బాపిరాజు రచనలు - 7

159

జాజిమల్లి(సాంఘిక నవల)