పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“మీరిద్దరూ అన్ని క్షేత్రాలూ చూచారుగా”

“ఓ! ఇంక ఇంటికి మళ్ళడమే!”

అప్పటికి పద్మావతి హృదయం ఊరట చెందింది వినీ వినబడని కంఠంతో.

“నరసింహమూర్తి మేష్టారూ! మీరు కూడా మీ యాత్రలు ఇంతటితో మానివేసి మదరాసు రావాలి. మీరు రాకపోతే నేను మదరాసు వెళ్ళగానే ఎవరికీ కనబడకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఆ పాప పుణ్యాలు మీవే!” అన్నది.

నరసింహమూర్తి మేష్టారు పద్మావతిని తన పక్కకు నొక్కుకుని “తల్లీ! నీ కోర్కె నాకు రామాజ్ఞ. పద అందరం కలిసే మదరాసు పోదాం” అన్నాడు.

2

రాధాకృష్ణ తనతో ఏమి మాట్లాడాడు? అతడు తన ఉద్దేశం గ్రహించాడు. అతని మాటల్లో మరేమీ ఘాటు లేకపోయినా, భావం ఘాటుగానే ఉంది. వెంకట్రావుకు ఆ మాటలతో నాలుగు రోజులు తిన్నగా తిండి సహించలేదు. నరసింహమూర్తి మేష్టారు వెళ్ళిపోగానే సుశీల వెంకట్రావుకు ఒక నాయరు వంటమనిషిని ఏర్పాటు చేసింది. అతని వంట కొన్నాళ్ళవరకూ వెంకట్రావుకు రుచించలేదు. తర్వాత అదే అలవాటయింది.

“వెంకట్రావుగారూ మనది 'ఫ్రీ లవ్' సంఘంకాదు! కాని అలాని ముసలమ్మ ఛాందసాలు కలవాణ్ణి కాదు. వివాహం చేసుకున్న స్త్రీ భర్త విషయంలో సత్యమైన నడవడి చూపించాలి. అంతకన్నా దిట్టంగా భర్త వర్తించాలి. ఇష్టం లేదూ, భార్యాభర్తల తనం రద్దు చేసుకోవాలి! ఏమంటారు! వెనక ఒకటీ, ముందు వేరొకటీ ఉంటే న్యాయమా చెప్పండి!” అని రాధాకృష్ణ అన్నాడానాడు.

ఆ మాటలకు వెంకట్రావు కించపడిపోయాడు. ముచ్చెమటలు పోశాయి. ఒకనిమేషం అక్కడ ఉండలేకపోయినాడు. వెంటనే అతడు “రాధాకృష్ణగారూ! నాకు చాలా అర్జంటు పని ఉంది. నేను వెడుతున్నాను. సుశీలగారితో చెప్పండి!” అని వెళ్ళిపోయినాడు.

ఇంటికి వెళ్ళే దారిలోనే అతనికి మతిపోయింది. కన్నీరు లేని దుఃఖం అతనికి పొర్లి వచ్చింది. వక్షము వేడినిట్టూర్పుతో నిప్పురాజేయ తోలుతిత్తిలా ఎగసిపోయింది. ఇంటికి పోయి పక్కమీద వాలిపోయినాడు. ఆ పూట అతడు భోజనం చేయలేదు. నాయరు పిలిచినా వంట్లో బాగుండలేదని వంక పెట్టినాడు.

ఆ మర్నాడూ, ఆ మర్నాడూ ఆఫీసుకు వెళ్ళలేదు. తన చీకు హృదయం అందరికీ తెలిసిపోయిందని అతడు సిగ్గుపడి కృంగిపోయినాడు. చివరికి నాయరుకూ తన మొగం చూపించలేకపోయినాడు. అతని జీవితం ప్రాథమికావస్థలోనే పెరిగింది. ఈ నాటికి బహుళ భావ సంఘాతంతో క్లిష్టమైంది. పరస్త్రీ గమనం మహా దోషమనిగాని, కాదనిగాని అతనికి ఎప్పుడూ ఆలోచించవలసిన అవసరం లేకపోయింది. అలాగే పరస్త్రీ గమనం చేయాలని కాంక్షా ఉద్భవించలేదు. ఆ రకమైన రంగులు అతని జీవిత చిత్రంలో సన్నిహితం కానేలేదు. పద్మావతే అతనికి సర్వమై బ్రతుకు నిండి ఉండేది. నేడా నిండుతనం వెలికి తాల్చింది. బహుముఖమైన పూర్ణ మానవ జీవితంలోని ఘాటువాసనలూ, పులుముడు రంగులూ, రకరకాల చీకట్లూ, వెలుగులూ, చిత్రవిచిత్రాలైన జీవితాలూ, భావాలూ,

అడివి బాపిరాజు రచనలు - 7

158

జాజిమల్లి(సాంఘిక నవల)