పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(దశమ గుచ్చము)

నరసింహమూర్తి మేష్టారును చూడటంతోటే పద్మావతి తెల్లబోయింది. అపరిమితాశ్చర్యంతో నిశ్చేష్ట అయింది! “మేష్టారూ!” అంటూ గబగబా ఆయన దగ్గిరకు పరుగెత్తి పోయి పాదాలకు నమస్కరించింది. “ఎల్లా వచ్చారు? మేము ఇక్కడ ఉన్నామని తెలిసిందా? ఇన్నాళ్ళూ ఎక్కడ ఉన్నారు? మీరు లేకపోవడం నాకు మతిపోయినట్లే అయింది”. ఇలా ఏవేవో మాటలు అంటూ మోము ప్రఫుల్లమైపోగా, బొమ్మలా నిలుచుండిపోయింది.

ఇది అంతా శ్రీమతి కరుణామయీదేవి చిరునవ్వుతో గమనిస్తూ అలా నిలుచుండినది.

నరసింహమూర్తి మేష్టారు ఆశ్చర్యంతో పద్మావతిని చూస్తూ మ్రాన్పడి అలాగే నిలుచుండిపోయినాడు. ఈమె పద్మావతేనా? అవును. అదిగో ఆమె వసతి గృహాధికారిణి శ్రీమతి కరుణామయి. పద్మావతి! పద్మావతే! అవును ఎలా వచ్చింది! “మీరు - మీరు - మీరిద్దరూ ఇక్కడకు ఎలా వచ్చారు?”

శ్రీమతి: అమ్మాయికి దక్షిణాదిలోని దివ్య శిల్ప క్షేత్రాలన్నీ చూడాలని బుద్ధి పుట్టింది. మేము ఇద్దరం కలిసి వచ్చాము. మీరు మమ్మల్ని ఇక్కడ కలుసుకోడం ఆశ్చర్యమే!

నర: నేనూ దక్షిణాదియాత్ర చేస్తూ, అయిదారు రోజులు తిరువాంకూరులో ఉండి, కన్యాకుమారిదేవిని అర్చించడానికి వచ్చాను.

వారందరూ కలిసి బసకు వెళ్ళారు. పద్మావతికి ఒకవైపు ఆనందమూ, ఇంకొకవైపు ఏదో ఆవేదనా? ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. ఆ రాత్రి చీకట్లో ఆమె నిద్రరాక పక్కపై కదలకుండా పడుకుని ఉన్నప్పుడు చటుక్కున ఓ ప్రబంధ కావ్యంలోని కథలా తన కథ ప్రత్యక్షమై జరిగిపోసాగింది.

తాను తప్పుచేసిందా? తనకు భర్త అంటే ప్రేమే లేదా? తన సంగీతం ఏమయింది? ఎందుకు తనకీ చదువు! ఈ శ్రీమతిగారూ, నరసింహమూర్తి మేష్టారూ ఎవరు? ప్రపంచంలో తనకింక పని ఏమి ఉంది?

ఉన్నట్టుండి ఆమె కన్నీరులో కరిగిపోయి, నరసింహమూర్తి మేష్టారు పాదాలకడ వాలిపోయి, ఆయన పాదాలమీద మోముంచి వెక్కి వెక్కి రోదించినది. నరసింహమూర్తి మేష్టారూ కూలబడి కూలబడి, పట్టలేని దుఃఖంలో మునిగి భుజాలు ఎగిరిపోతూ ఉండగా గొల్లుమని ఏడ్చినారు.

శ్రీమతి కిది ఏమీ అర్థంకాలేదు.

“ఏమిటండీ ఇది? మీ కిద్దరికి మతిపోయిందా? లెండి” అని అంటూ వారిద్దరినీ ఆమె కేకలు వేసింది.

నరసింహమూర్తి మేష్టారు త్వరగా సంబాళించుకొని, తాను లేచి పద్మావతిని లేవదీసి, తన హృదయానికి అదుముకొన్నాడు.

అడివి బాపిరాజు రచనలు - 7

156

జాజిమల్లి(సాంఘిక నవల)