పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

నిజంగా స్వామీజీ చెప్పినట్లే అన్నీ జరిగినవి. నాయనా పిళ్ళే స్వామీజీ పాదాలకడ వాలినాడు.

స్వామివారు ఏదో మంత్రముపదేశించి తామే స్వయంగా ఆ యువకునకు సంగీతం చెప్పినారు. ఎవరీ స్వామి? నారదుని అవతారమా అని ధనకోటీ వారూ అనుకున్నారు.

ఒకరోజున ఆ స్వామి మాయమైపోయినాడు. నాయనా పిళ్ళే దుఃఖం ఏడు సముద్రాలైనది. గురువుగారిని స్మరిస్తూ ఆ త్యాగరాజు అపరావతారం. ఆనాడు భారతీయ గాయకులలో నాయకమణి అయినారు. మహాభక్తుడు ధనానికి ఆశించలేదు. నిత్య నాదబిందు కళారాధనమే!

“ఆయన తమ నలభైరెండవ ఏట గాన తేజస్సులో లీనమైపోయినారు. చెల్లీ! ఆయన శిష్యుడే చిదంబరపిళ్ళేగారు. నా చిన్నతనంలో కాకినాడ గానసభలో ఆయన కచ్చేరి విన్నప్పుడు నా ఆత్మ నన్ను వీడి ఆయన పాదాలకడ వాలింది.”

"అక్కా ఆయన రికార్డులు ఏమీ కనబడవే?”

“ఆయన రికార్డులే ఇవ్వలేదు. లక్షలు ఇస్తామన్నారు ఒప్పుకోలేదు. ఇంతకన్న ఛాందసుడు తుమురాడ సంగమేశ్వరశాస్త్రిగారు. ఈ యుగంలో వీణా పరమేశ్వరుడు, ధనాన్ని దోసి, తన జీవితం నాదబిందు కళారాధనకు అర్పించినాడు. ఇద్దరూ బీదవారుగానే పోయినారు.”

“ఎంత చక్కని కథ చెప్పావు అక్కా?”

“ఇది కథకాదు చెల్లీ, చరిత్ర!”

“ఆ చరిత్రలో నువ్వూ భాగస్వామివే. ఎంత అదృష్టవంతురాలవు!”

"తల్లీ! నీ జీవితం సంగీతాంకితం చేయి. సుబ్బలక్ష్మి పట్టమ్మాళులను మరపింపచేయి. ఇదీ నీ తపస్సు. నీ భర్త ఉత్తముడు. అతని హృదయం నలిపివేయకు, భగవంతుని పూజా పుష్పంలా చూచుకో!"

ఈ మాటలు అంటూ ఉంటే అక్కడకు నరసింహమూర్తి మేష్టారు నడిచి చక్కా వచ్చారు.


★ ★ ★

అడివి బాపిరాజు రచనలు - 7

155

జాజిమల్లి(సాంఘిక నవల)