పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గంగ నూపురంబునను జనియించెను
        రంగని గని కావేరి రాజిల్లెను.
పొంగుచు శ్రీరఘునాథుని, ప్రేమతో
        బొగడు త్యాగరాజు మనవి వినవే ||కోటి||

అన్న త్యాగరాజు కీర్తన పాడింది.

"కోటి నదులు అనగానే గంగా, యమునా, గోదావరీ, కృష్ణా, మహానది, సింధు, నర్మదా, తపతీ, కావేరీ మొదలయిన భారతీయ నదీ నదాలు వివిధ దేశాలలో మస్సోరీ, అమెజాన్, నీలవోల్గా, ఒరోనికో, జాంబేసీ వోల్గాది నదులు అన్నీ వివిధ రాగాలు పాడుకుంటూ శ్రీరామచంద్రుని పాదాలకడకు ప్రవహించి వస్తున్నట్లు ప్రత్యక్షమైనది శ్రీమతికి. శ్రీమతి తన్మయురాలైనది.

తాము దర్శించిన ధనుష్కోటేనా రామాయణకాలపు ధనుష్కోటి! అక్కడనుండేనా శ్రీరామప్రభువు లంకకు వారధి నిర్మించినది? ఈనాటి సింహళమేనా ఆనాటి లంక?

“ఈ కన్యాకుమారీ అగ్రమూ ఈ సముద్రమూ చూచేనా ఆ కీర్తన జ్ఞాపకం వచ్చింది నీకు గీతాదేవి?”

“అదేమిటక్కా నన్ను అలా పిలుస్తున్నావు?”

“నిజంగా నువ్వు గీతాదేవివే! ఈ పాట నా చిన్ననాడు నాయనా పిళ్ళే పరమ గాంధర్వ స్వరూపంగా పాడినాడు.”

“నాయనా పిళ్ళే అనే పేరేమిటి?"

“అసలు పేరు సుబ్రహ్మణ్య పిళ్ళె. నలుగురు అక్క చెల్లెళ్ళు ధనకోటి సోదరీమణులు. ధనకోటి, కామక్షమ్మ అమ్మా పొన్నమ్మ, చినకుట్టెమ్మ. కామాక్షమ్మ కుమారుడు నాయనా పిళ్ళై. పేరు సుబ్రహ్మణ్యం అయినా తల్లులు నలుగురూ 'నాయనా' అని పిలవడంచేత 'నాయనాపిళ్ళె' అయినాడు!"

“పిళ్ళెలు గొల్లవారా?”

“ఈ పిళ్ళెలు భోగంవారు. అందులో వీరు తెలుగు భోగంవారు. ధనకోటి మహోన్నత సంగీత విద్వాంసురాలు. ఆ కుటుంబంలో ఈయన పుట్టాడు.”

“చిన్నతనాన్నుంచి సంగీతంలో లయమైపోయి ఉంటారు.” “ప్చ్! వట్టిమాట ముఫ్పై ఏళ్ళవరకు రౌడీ! అల్లారుముద్దుగా పెరిగిన బాలుడు! ఇంకేమి, ఏ కృషీ పట్టుబడలేదు. రౌడీల సావాసం, సామూ, కసరత్తూ, ఓ జట్కాబండి ఉండేది. ఆయనకు ముప్పై ఏళ్ళు వచ్చినప్పుడు, కంచికి ఒక మహాయోగి విచ్చేసినాడు. ఆయన 'కైలాసనాధాలయం'లో విడిది చేశారు. ఆయన తేజస్సు చూచి నగరమంతా ఆయన్ను దర్శించి పునీతులయ్యారు. ధనకోటి చెల్లెళ్ళతో ఆయన దర్శనం చేసింది. తన చెల్లెలి కుమారుని సంగతి చెప్పుకొన్నది. “రేపు ఉదయం నేను రమ్మన్నానని చెప్పి ఆ యువకుని తీసుకొనిరండి.” అని స్వామీజీ ఆదేశించారు.

ధనకోటి: వాడు ఎంత బ్రతిమాలినా రాడండీ!

స్వామి: నేను రమ్మన్నాను అంటే వెంటనే వస్తాడు.

అడివి బాపిరాజు రచనలు - 7

154

జాజిమల్లి(సాంఘిక నవల)