పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షాడపరాగాలు అనురాగ, కరుణ, క్రోధాది రాగాల రూపాలు కాబోలు, ఆమెకు తల తిరిగినది. ఆమెలోనుండి బరువైన నిట్టూర్పు వెలువడింది.

ఆ నిట్టూర్పు విని శ్రీమతి ఆమెవైపు తిరిగింది. “ఎందుకు తల్లీ నీకు నిట్టూర్పు?”

“ఎందుకేమిటి? ఈ సముద్రం ఎంతవరకు? ఏ తీరాలు చేరుస్తుంది! ఆ తీరాల భూమి ఎంతవరకు, ఏ సముద్రాలవరకూ! ఆ సముద్రాలు?”

“అలాగే ఆలోచనలు సముద్రంలోని కెరటాలవుతాయి... స్వప్నాలు లోతులు!”

“ఎంత లోతులు?"

“మనం మునగలేనివి!”

“అప్పుడా లోతులకు సార్థకత?”

“తెలుసుకోగలిగినవారికి!”

“ప్రతి విషయమూ సముద్రమేనా?”

“కాక!”

“ఆకాశమంత అనంతమా సముద్రము లోతు!"

“ఆ లోతూ అనంతంలోనే లీనమవుతుంది!”

“అంటే?”

“ఫసిఫిక్ మహాసముద్రం ఆరుమైళ్ళ లోతు అనుకో! అక్కడ భూమి, ఆ భూమి తవ్వుకుంటూపోతే, కొన్నివేల మైళ్ళవతల ఆవలప్రక్క సముద్రం ఆ సముద్రం పై అంచు ఆకాశంలో!"

ఇద్దరూ మౌనం వహించారు.

అలా వారు రెండురోజు లాగినారు.

మూడవదినం ఉదయం ఆ అగ్రసముద్రంలో స్నానం చేసి, కన్యాకుమారి గుడిలో పూజలుచేసి, వచ్చి భోజనానికి ఇంకా రెండు గంటలు వ్యవధి ఉండడంవల్ల సముద్రం ఒడ్డునే వచ్చి కూచున్నారు. ఇంకా యాత్రికులు స్నానాలు చేస్తూనే వున్నారు. కుడివేపుగా సూర్యుడు ఆకాశంలోనికి చొచ్చుకుపైకి సాగిపోతున్నాడు. చల్లని గాలి వీస్తూంది. ఆకాశంలో మేఘాలులేవు. సముద్రం కెరటాలు ఎక్కడ ఉద్భవించాయో, వస్తూ ఒడ్డున విరుగబోయే రేకలు తాల్చి వయ్యారంగా తలలు వంచి నురుగులతో, బుడగలతో విరుగుతున్నాయి. ఆ విరుగుడులోనుంచి చిన్న తరంగాలు ఉద్భవించి ఒడ్డుకు గుసగుసలతో నివేదిస్తున్నవి.

3

అప్పుడు పద్మావతి సముద్రం హోరుకు తన కంఠం శ్రుతి కలిపి, తోడిరాగంలో, ఆదితాళంలో -

“కోటి నదులు ధనుష్కోటిలో నుండగ
        ఏటికి తిరిగెదవే? ఓ మనసా ||కోటి॥
 సూటిగ శ్యామసుందరమూర్తిని
 మాటిమాటికి జూచు మహారాజులకు ||కోటి||

అడివి బాపిరాజు రచనలు - 7

153

జాజిమల్లి(సాంఘిక నవల)