పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పద్మావతి: మనకు ఏది మంచో, ఏది చెడ్డ ఎల్లా తెలుస్తుంది అక్కా!

శ్రీమతి : మన జీవితంలోని సామ్యశక్తే అది నిర్ణయించగలదు.

అన్ని క్షేత్రాలలోని గుళ్ళూ, గోపురాలూ చూపిస్తూ, వానిలోని శిల్ప సౌందర్యం వర్ణిస్తూ, మధుర, రామేశ్వరమూ మొదలయిన క్షేత్రయాత్రలు సంపూర్ణం కావించి, తిరువనంతపురం చేరుకున్నారు మన ఇద్దరు యాత్రికులు.

తిరువనంతపురంలో అనంత పద్మనాభుడి దర్శనం చేసుకుని కన్యాకుమారి అగ్రం చేరుకున్నారు వారు.

2

కన్యాకుమారి అగ్రం దగ్గిర, ఎదుట ఆకాశంలోనికి పోయి పోయి విశ్వానితో లీనమైపోయిన మహాసముద్ర గంభీరభావం దర్శించి పులకించిపోయినారు మన యాత్రికులిద్దరూ!

“ఈ సముద్రము కలియు
      ఏ విశ్వరూపాన!
 ఈ జీవితము మెలయు
      ఏ దివ్య భావాన
 నిత్యయాత్రాంకిత పు
      నీతమగు నాతరగ"

అంటూ తీయగా పాడుకొన్నది శ్రీమతి.

“ఈ దృశ్యానికి, ఈ పాటకూ సంబంధం ఏమిటి అక్కా!”

“ఓసి వెఱ్ఱిదానా! ఒక పవిత్రదృశ్యం సంఘాతమై ఒక మహాభావం ఉదయిస్తుంది. అది కావ్యరూపంగా వచ్చినప్పుడు ఆ దృశ్యానికీ, ఆ కావ్యానికి ప్రత్యక్ష సంబంధమేమీ కనబడదు నిజమే! కాని ప్రతి కావ్యానికి విశ్వమే హంగవుతుంది.

ఆ పాట ఎంత అర్థమైనదో, ఆ మాటలూ అంతే అర్థమయ్యాయి పద్మావతికి. అయినా పద్మావతి శ్రీమతి ఆలోచనాపథం కొంచెం కొంచెం అవగతం చేసుకొంటున్న కొలదీ ఆమెకూ ఏవేవో నూతనమైన పొలిమేరలు గోచరిస్తున్నాయి. మానవజీవిత వైచిత్రి సర్వశ్రుతియుక్తమై ఆమెకు దర్శనమిస్తున్నది. సామ్యతలు ఉండవు. ఒక్కొక్కప్పుడు తాళం తప్పుతుంది. గమకము మాయమౌతుంది.

ఈ నిత్యయాత్రలో మనుష్యు డొకప్పుడు అటూ ఇటూ పడిపోతాడు. జీవితం దుర్బరమౌతుంది. కాలం అప్పుడు చౌకగా ప్రసరిస్తుంది. సంతోష సమయాలు ధృతంగా ప్రవహించిపోతాయి. అందుకనే నా పదాలలోని విరహబాధ విలంబితమౌతుంది? కవులు బాధాపూర్ణమైన క్షణాలను యుగాలుగా వర్ణిస్తారు. ఆనంద స్పందితమైన సంవత్సరాలు క్షణికాలై గడచిపోయినాయంటారు.

కాలగర్భంలోనుండి ఉద్భవించి కాలాతీతమౌతుంది. రాగం. మానవకాంక్షా రూపమైన రాగమే సంగీతంలో రాగమైనది. కాబట్టే అనంతమైన సంపూర్ణ, ఔడప,

అడివి బాపిరాజు రచనలు - 7

152

జాజిమల్లి(సాంఘిక నవల)