పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(నవమ గుచ్చము)

“కంచిలో నాయనాపిళ్ళై, పుదుక్కోటలో దక్షిణామూర్తిపిళ్ళే, తిరుచునాపల్లి గోవిందస్వామిపిళ్ళై, అలహనంబి, కోయంబత్తూరు తాయి, బెంగుళూరు నాగరత్నం, వీణధనం, కంచి ధనకోటి, బందరు సుసర్ల దక్షిణామూర్తిగారు వీరందరూ కొద్ది సంవత్సరాల క్రితం వరకూ సర్వదక్షిణాపథమూ రసవాహినులతో నింపిన మహాగాయకులు. ఆంధ్రలో సంగమేశ్వరుడు, వీణ రమణయ్యగారు, ఆదిభట్ల నారాయణదాసు” అని, శ్రీమతి తిరుచునాపల్లిలో విఘ్నేశ్వరుని కొండ ఎక్కుతూ పద్మావతికి చెప్పింది.

“ఓహో, ఆనాటివారి అదృష్టం అక్కా! ఈనాడు అరియకుడి, శెంబంగుడి, మధురమణి, పాపా వెంకట్రామయ్య, బాలసుబ్రహ్మణ్యం మొదలయిన వారున్నూ ఉన్నారు. ద్వారంవారు, హరినాగభూషణంగారు, పారుపల్లి రామకృష్ణయ్య జగత్పూజ్యులు.”

“మనం ఎప్పుడూ ఏ విద్య విషయంలోనన్నా విద్యార్థులుగా ఉండాలి చెల్లీ! ఈ విశ్వ రహస్యము, మన నిత్య విద్యార్థిత్వంలో కొంచెం కొంచెంగా, తెరవీడుతూ దర్శనమిస్తుంది. ఆ ప్రత్యక్షమే మనకు ఆనందం సమకూరుస్తూ ఉంటుంది.”

“ఆనందమేనా ఈ ప్రపంచానికి కావలసిన వస్తువు అక్కా?”

“అవును! సేవ ఇతరులకు ఆనందం సమకూర్చడానికి, జ్ఞానం ఆనందంకోసం. సర్వకృషీ ఆనందంకోసం. కళలు ఆనందంకోసం!" ,

“వైద్యమూ, వ్యవసాయమూ, చేపలు పట్టడమూ ఆనందంకోసమా ఏమిటి అక్కా”

“ఆ! ఇతరులు జబ్బుతో బాధపడుతూ ఉంటే, వైద్యం వల్ల జబ్బుకుదిర్చి ఆనందం సమకూరుస్తాముకాదా? వ్యవసాయం తిండిగింజలు వగైరాలవల్ల ఆకలి తీరితే ఆనందం. అందుకే చేపలు పట్టడమూనూ!”

ఈలా అనేక విషయాలు చర్చించుకుంటూ పద్మావతీ, శ్రీమతీ తీర్థయాత్రలు సాగిస్తున్నారు. అనేక మానవ ప్రకృతులు ఈ యాత్రలో పద్మావతికి శ్రీమతి బోధవల్లనైతేనేమి, తాను గాఢంగా పరిశీలించడంవల్లనైతేనేమి అవగతం కాసాగినవి.

మనుష్యుడు తనకు లోటైన శక్తీ, సంపదా, ఇతరులలో ఉంటే చూచి ఓర్వలేడు. ఓర్వలేనితనం జగత్సంక్షోభానికి కారణం అవుతుంది. దక్షిణాది సంగీతనిధులు కర్ణాటక బాణిని అద్భుతంగా కాపాడుకుంటూ వస్తే, నీరసులై పరిశ్రమ చేయక తపస్సు చెడగొట్టుకుని తెలుగువారు అరవడం ఎందుకు! ద్రావిడ కజగం అని బ్రాహ్మణద్వేషంతో దక్షిణాది బ్రాహ్మణేతరులు అరవదేశానికి స్వాతంత్ర్యం కావాలనడానికి కారణమూ ఈ ఓర్వలేని తనమే!

శ్రీమతి : 'కజగం' - 'సంఘం' అన్న సంస్కృత మాటకు తద్భవం. 'పేశం' - 'భాష' అన్న పదానికి తద్భవం. ఇంక మణిమేఖలై, శిలప్పాధికారం సంస్కృత సమాసాలే. వారి తొలిక్కాప్యయంలో 'కాప్యం' అన్నమాట 'కావ్యం' అన్న మాటకు తద్భవం.

అడివి బాపిరాజు రచనలు - 7

151

జాజిమల్లి(సాంఘిక నవల)