పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“కారణం ఏమిటి నీ మొగం! కాస్త స్పష్టంగా చెప్పాను, అతడు మారిపోయినాడు. దిగాలుపడిన హృదయంతో చక్కాబోయి ఉంటాడు.”

“నీతినియమాలు చెప్పడం సాగిస్తివి కదా కాబోలు. నీ దొంగనీతి, నీ పద్దతీ నాకుదా తెలియవా? నీ సుగుణగుణాలు మన స్నేహములో నాకుదా అర్థం కాలేదా? మన సినిమా జాతివారికి నీతినియమాలు కూడా ఉండునా ఏమి? ఒక బాలికను ఒకడు పెళ్ళిచేసుకుంటానని ఆశపెట్టి తీసుకుపూడుస్తుడు! ఆవిడ ఒక గొప్పతార! అయినా వెఱ్ఱిబాగుల్ది. ఆ పిచ్చిది వాణ్ణి నమ్మి వాడితో పెళ్ళి అవుతుందని నమ్మకంతో వాడితో కాపురం చేస్తుందే? ఎన్న! ఆమెకు గర్భం ఆవరిస్తుంది! తన అవసరం తీరగానే అతడు ఆమెను వీధిలోనికి త్రోసి తలుపు వేసుకుంటాడు. ఆడవాళ్ళు మీ కళ్ళకు పశువులు. బజారు వస్తువులు. చూడు ఈ బుచ్చి వెంకుల్ని! వీడుదా పంది. చక్కనిది, ప్రజ్ఞావంతురాలు - అలాంటి భార్యనుదా సరీగా చూడలేక తన ఇంటిలోనించి తరిమివేస్తే ఆ అమాయకురాలు ఆంధ్ర మహిళా సభలో వెళ్ళిచేరిందే! ఆనందం పడుతోంది. పాపం! ఆవిడ ఏదో బాధపడుతూ దక్షిణాది యాత్రలకు బయలుదేరిందట!”

“ఓసి ఫూల్! నేను ఎప్పుడైనా నీ విషయంలో అనౌచిత్యంగా ప్రవర్తించానా? మనం ఇద్దరం వివాహం చేసుకొనే ముందు నేను సంబంధం కల్పించుకొన్న స్త్రీలు వట్టి జారిణులు. నేనా వివాహంముందు నా చరిత్ర అంతా నీతో చెప్పినాను. పోనీ నువ్వు మాత్రం 'అనాఘ్రాత పుష్పం'లా ఉంటివి గనుకనా? కాని మన వివాహం ఐన దగ్గరనుండీ నా చరిత్రలో ఏ విధమైన దోషమైనా చూపించగలవా? ఒకటే చెపుతున్నాను. బాగా మనస్సుకు ఎక్కించుకో! నీకూ యీ బుచ్చి వెంకట్రావుకూ ఎంతవరకూ వెళ్ళిందో నాకు తెలియదు. నీకు అతనితో గాఢసంబంధం ఏర్పాటు చేసుకోవాలని ఇష్టం పుడితే నా చాటున మాత్రం ఆ విధమైన నడవడిక సుతరామూ వీలులేదు. అంతటితో నీకూ నాకూ బంద్. ఈ ఆస్తి అంతా తీసుకుని వెళ్ళిపో - నేను మళ్ళీ కొత్తగా నా జీవితం ప్రారంభించుకుంటా.”

ఎప్పుడూ ఏడుపంటే ఏమిటో ఎరుగని సుశీల అక్కడ సోఫాపై కూలబడిపోయింది. వెక్కి వెక్కి ఏడుపు ఆమెను ముంచుకొచ్చింది. సోఫాలో పడిపోయి, దిండులో ముఖము దూర్చుకొని సముద్రము పోటులా రోదించింది.


★ ★ ★

అడివి బాపిరాజు రచనలు - 7

150

జాజిమల్లి(సాంఘిక నవల)