పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాట్లాడుకోవలసి ఉందే. కాఫ్యాదులకు ఆర్డరుదా ఇస్తున్నాను.” అని గబగబ లోనికి వెళ్ళిపోయింది.

3

ఆమె లోనికి వెళ్ళిపోగానే రాధాకృష్ణ బుచ్చి వెంకట్రావు దగ్గిర కూర్చుండినాడు.

“వెంకట్రావుగారూ, మీ మోములో ప్రసరించిన ఛాయలను చూచి, మీరు నన్ను గూర్చి తప్పభిప్రాయాలు పడుతూవున్నట్లనుకుంటున్నాను.”

“అవన్నీ ఇప్పుడెందుకులెండి?”

“నన్ను పూర్తిగా చెప్పుకోనివ్వండి. నాకు పూర్వ కాలపు ఛాందసపు భావాలేమీ లేవు. స్త్రీలు ఎవరిని ప్రేమించారో వారితో కులాసగా ఉండవచ్చునని నా నిశ్చయమైన అభిప్రాయం. కాని వివాహం చేసుకొన్నాక ఆ భర్తకు విడాకులు ఇచ్చి, తాను మళ్ళీ వివాహం చేసుకోవాలి. అంతే. వివాహం చేసుకొని ఆ భర్త వెనక పరపురుషునితో సాంగత్యం చేయడం నా ధర్మశాస్త్రం ప్రకారం అధర్మం. తన భర్తను తాను పురుషునిలా ప్రేమించి, స్నేహంలో ఇతర పురుషులతో అతి చనువుగా ఉండవచ్చును. అంతే! మీరు సుశీల నడవడి యొక్క గమత్తు చూచి, ఆమె మిమ్ము ప్రేమిస్తున్నదని తప్పభిప్రాయ పడుతున్నారని అనుకుంటున్నాను. నా జీవితం వదులు అయినదే! కాని అధర్మం, అసత్యం, నా బ్రతుకుకు నూరుగజాల దూరానికైనా రానివ్వను. నేను సుశీలను కనుక్కుంటాను. ఆమె మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే, వెంటనే ఆమెకు విడాకులు ఇస్తాను. నేను సుశీలను గాఢంగా ప్రేమించవచ్చును. కాని నా ప్రేమ ఆమె జీవితానికి అడ్డం రాకూడదు. ఈ విషయమే చెప్పితే మీరు నన్ను గురించి తప్పభిప్రాయాలు పడరని అనుకుంటాను. ఈ సంఘటనలు స్నేహానికి అడ్డం రాకూడదు. దొంగస్నేహం అయితేనే స్నేహంకాదు. అది శత్రుత్వానికన్న అధమాధమం!”

రాధాకృష్ణ మాటలు వింటూ వుంటే, బుచ్చి వెంకట్రావు మనస్సు క్రుంగిపోయింది. రాధాకృష్ణ మాటలలో దాపుడు లేదని మాత్రం అతనికి తట్టింది. అవును తాను సుశీలను వాంఛించినమాట నిజం. ఆమె ఉద్దేశమేదో! తాను పద్మావతిని వదలి, ఆమెకు విడాకులు ఇచ్చి సుశీలను పెళ్ళి చేసుకోవాలా?

అతనికి హృదయం ఎక్కడికో జారిపోయినట్లయినది. బుచ్చి వెంకట్రావు మాటలాడలేదు. అతడు చటుక్కున లేచి వీధిలోనికి వెళ్ళి తన కారు ఎక్కి ఇంటికి వెళ్ళిపోయినాడు. రాధాకృష్ణ ఆశ్చర్యముపొంది, కదలక అట్లానే నిలుచుండిపోయినాడు. అతని సిగరెట్టు చేతిలో కాలుతూనే ఉంది.

ఇంతట్లో సుశీల చీరమార్చి మంచిరకం సిగరెట్టులా వచ్చింది.

“ఎంగె మన బుచ్చి వెంకట్రావు?” ఆమె మాటలు తీక్షణంగా ఉన్నాయి.

“ఇంటికి వెళ్ళిపోయినట్లున్నాడు!”

“నువ్వు పంపి వేస్తివా?”

“నేను వెళ్ళమనలేదు, వెళుతోంటే ఉండమనలేదు.”

“కారణం?”

అడివి బాపిరాజు రచనలు - 7

149

జాజిమల్లి(సాంఘిక నవల)