పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“మీ ఆయన పెద్దమేడ తీసుకున్నాడు. శుభ ముహూర్తం చూసి అందులో ప్రవేశించాలి. త్వరలో సినిమా పని ప్రారంభించాలి. మీ ఆయన నాకు అప్పగించిన సోమేశ్వరరావు అచ్చుపనులన్నీ చేస్తున్నాడు. ఏమి కథో మనం ఆలోచించలేదు సుశీ!”

సుశీల బుచ్చి వెంకట్రావును సోఫాలో కూచో పెట్టి అతని పక్కగా, దగ్గిరగా కూచుంది. అతని మెడచుట్టూ చేయివేసి, కుడిచేత్తో జుట్టు సవరించసాగింది.

“నువ్వేగా నాకుదా నాయకుడవు?”

“నువ్వేగా నాకు నాయికవు?”

ఇద్దరూ పకపక నవ్వుకున్నారు. వారిద్దరూ అలా కూచుని ఉండగానే, అక్కడకు రాధాకృష్ణ ఏదో కూనిరాగం తీస్తూ వచ్చాడు.

“ఏవైనా సినిమా సీను రిహార్సులు చేస్తున్నారా?” అన్నాడు రాధాకృష్ణ.

సుశీల నెమ్మదిగా దూరంగా జరిగింది.

బుచ్చి వెంకట్రావు కంగారుపడ్డాడు. తెల్లబోయాడు. నెమ్మదిగా సంబాళించుకొని వెండి సిగరెట్టు కేసు జేబులో నుండి తీసి, మీటనొక్కి తెరచి, అందులో స్టేటు ఎక్స్‌ప్రెస్ 555 సిగరెట్టు రాధాకృష్ణను తీసుకొని కాల్చమన్నట్లు అతని ఎదుట చాచినాడు.

“నేను త్రీ కాజిల్సు తప్ప ఇంకోరకం కాల్చను కాదటయ్యా! ఒక్కొక్క గొంతుక్కు ఒక్కొక్కరకం చక్కగా సరిపోతాయి!” అని రాధాకృష్ణ తన సిగరెట్టు కేసు తాను తీసుకొని ఒక సిగిరెట్టు వెలిగించాడు. -

రాధాకృష్ణకు కోపం వచ్చిందనీ బుచ్చి వెంకట్రావు అనుకున్నాడు. ఏమిటి ఈతని ఉద్దేశం? సుశీలను తన కౌగిలింతలలోనికి పురికొల్పింది అతడే! తమరిద్దర్నీ వదలి ఎన్నిసార్లో రాధాకృష్ణ వెళ్ళిపోయాడు. సుశీల కూడా తన మనస్సు కరిగించి ఆమె అంతట ఆమె తన ఒడిలోనికి ఏలా చేరింది! చిత్రచిత్ర విలాసాలెన్నో సుశీల తనచుట్టూ భర్త ఎదుటె సుళ్ళుచుట్టి వేస్తూంటే, ఆ భర్త ఏమీ అనకుండా, చూచీ చూడనట్లున్నప్పుడు సుశీల తన పురుషత్వానికి స్త్రీ కావడం వారి కిష్టమనుకున్నాడు బుచ్చి వెంకట్రావు. అతడింతవరకూ పరస్త్రీ సంగమ దోషానికి పాల్పడలేదు. ఈ మధ్యే ఏ దుష్టపు గడియలు ఆవేశించాయో తనకూ తన భార్యకూ మధ్య దూరాలు ఉద్భవించుకు వచ్చాయి. ఆ సమయంలోనే శ్రీ శుకుణ్ణి కూడా మనసు మురిపించే సుశీల తన జీవితంలో ప్రవేశించింది. ఆ ప్రవేశంలో ఉన్న భావం పూర్తి కాకుండా రాధాకృష్ణ అడ్డం వచ్చేటట్లయితే వీళ్ళు తన్ను మోసం చేస్తున్నట్లే అయిందిగా! అందుకనే ఆ పిచ్చి బ్రాహ్మణుడు నరసింహమూర్తి అంత గోలపెట్టాడు.

రాధాకృష్ణ బుచ్చి వెంకట్రావుకు తెలియకుండా అతని మోము పరిశీలించి అతని హృదయంలో సుడిగాలై తిరిగే భావాలు గ్రహించాడు.

“సుశీ! మా ఇద్దరికీ ఏవైనా ఫలహారం కాఫీలు ఏర్పాటు చేయి.” అని సుశీలవైపు బుచ్చి వెంకట్రావు గమనించకుండా తీక్ష్ణమైన చూపు బరపి కంటిసైగ చేసినాడు.

సుశీల బుచ్చి వెంకట్రావు దగ్గరకు వచ్చి అతని భుజం మీద చేతులువేసి "అయిదు నిముషాలలోగా దుస్తులు మార్చుకుని వస్తుంటిని. మనం ముగ్గురం చూస్తివా, చాలా

అడివి బాపిరాజు రచనలు - 7

148

జాజిమల్లి(సాంఘిక నవల)