పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“ఎందుకండీ మీ భార్యను చదివించాలని పూనుకొన్నారు. ఆవిడ నరాలు ముద్దవుతున్నవి? ఆవిడకు పేరూ ప్రఖ్యాతులూ వచ్చేశాయి. చదువుమీద శ్రద్ధ తగ్గింది. మొన్న జరిగిన పరీక్షలలో ఆ అమ్మాయికి చాలా తక్కువ మార్కులు వచ్చాయి. అంతకుముందు వచ్చిన మార్కులను బట్టి ఆలోచించడానికి వీలులేదు.”

“ఈ మధ్య ఎక్కడా సంగీత సభలు ఒప్పుకోలేదుకదా అండి!"

“నిజమేనండి. సంక్రాంతి ముందునుంచి అలాగనే చదువు సాగించింది. కాని జీవితం అంతా సంగీతం పొదివి వున్న ఆ బాలికకు చదువుకు తావులేదు. చదువుకోసం సంగీతం మానుకునేసరికి, ఆ అమ్మాయికి నరాలు పట్టుతప్పిపోతున్నవి. మతి తారుమారవుతున్నది.”

“మీ సలహా ఏమిటండీ?”

“చదువు మానిపించి ఒకసారి ఇంటికి తీసుకువెళ్ళండి.”

“పరీక్ష రోజులు మూడు నెలలే కాదండీ ఉంటా!”

“ఏమి లాభం ?”

బుచ్చి వెంకట్రావు తల వాల్చుకొన్నాడు. అధ్యక్షురాలికి నమస్కరించి, వచ్చి కారులో కూచున్నాడు. కారును తానే నడుపుకొని వచ్చినాడు. ఎక్కడకు పోవాలో అతనికి తెలియలేదు.

అతనికి సుశీలాదేవిని సలహా అడుగుట ఇష్టం లేదు. తాను తన భార్యంటే చాలా ఆపేక్షగా ఉంటాడని ఆమె అనుకుందేమో! అనుకుంటే తప్పేమి? అని మళ్ళీ అనుకున్నాడు. కాదు. ఆమెతో ఈ విషయం చర్చించకూడదని అతడు నిశ్చయం చేసుకున్నాడు. అతడు వెంటనే సుశీల దగ్గిరకు కారు పోనిచ్చినాడు.

సుశీలకు పద్మావతి హంపి మొదలైన క్షేత్రాల యాత్రకు వెళ్ళిందని బుచ్చి వెంకట్రావు చెప్పగానే “మంచి పనిదా చేసింద”ని ఆమె వెంటనే అన్నది.

“అదేమిటి? ఈ యాత్ర మంచిదే నంటావు సుశీలా?”

“తప్పక! తిరగనీ దేశాలు. ఏమయ్యా యాత్రవల్ల వచ్చే జ్ఞానం జన్మంతా చదివినా రాదే!”

“వెళ్ళితే వెళ్ళనీ, నాకేమి గాని ”

“నీ భార్య సంగతి నీకుదా అక్కరలేదా?”

“భార్య అని ఒళ్ళో పెట్టుకుని తిరుగుతారా?”

“ప్రేమ ఉంటే అంతేదా!"

“ప్రేమ ఉంటే కూడా, ముభావంగా ఉన్నట్లు కనబడే భార్యాభర్తలు లేరా?”

“కాబట్టి నీకు నీ భార్యా అంటే బాగా ప్రేమ అన్నమాట ఆపిడి!”

“ప్రపంచం సంగతి చెబుతున్నానుగాని.”

“చిత్రంగా వుంది నీ సంగతే! ఇంతకూ నీకు నీ భార్యమీద బాగా ప్రేమ వుందా లేదా సొల్లు!”

బుచ్చి వెంకట్రావుకు సుశీల అనే మాటలకు చాలా కోపం వచ్చింది.

అడివి బాపిరాజు రచనలు - 7

147

జాజిమల్లి(సాంఘిక నవల)