పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లేపాక్షీ క్షేత్రానికి సంబంధించిన పూర్వగాథలు తెలుసుకుంటూ ఆ విచిత్ర దేవాలయాన్ని, అందున్న అద్భుత శిల్పాన్ని, విచిత్ర చిత్రలేఖనాలనూ గమనిస్తూ వారిరువురూ జగత్తును మరిచిపోయారు.

అక్కడనుండి మైసూరు రాష్ట్రంలో హోయసాల శిల్పుల సంపూర్ణాలంకార స్వరూప మహాభావ విన్యాస దార్శనికాలైన దివ్యశిల్పాలను, బేలూరు, హాలేబీడులలో వారు దర్శించారు.

అక్కడనుండి శ్రవణ బెలగోలాలో గోమతేశ్వరుని దర్శించారు.

“ఎందుకు అక్కా, మనుష్యుడు కొండలలాంటి ఈ మహాశిల్పాలను సృష్టిస్తాడు?” అని పద్మావతి ప్రశ్నించింది.

“చెల్లీ! మనలో అతిసూక్ష్మ శరీరమూ ఉంది అతి స్థూలమైన ప్రపంచమూ ఉంది. అతి సూక్ష్మభావాలే పారలౌకిక విశ్వంలో విశ్వస్వరూపాలైన భావాలు, వానికి రూప కల్పన చేసేటప్పుడు, ఈ పర్వతాలలాంటి శిల్పాలను సృష్టిస్తారు.”

మైసూరులో వారు బృందావన వన సౌందర్యం, గరిసెప్ప జలపాతం, అద్భుత ప్రకృతీదేవి ఆనంద తాండవం చూచినారు.

ఈ తాండవభావం ప్రత్యక్షం చేసుకొనడానికి వారు చిదంబరం చేరినారు.

శ్రీమతి పద్మావతికి నటరాజభావం వర్ణించి చెప్పింది. సృష్టిస్థితి లయాత్మకమైన లీల లీనాట్యభావములు. అందుకనే,

“ఆంగికం భువనం యస్య
 వాచికం సర్వవాఙ్మయం
 ఆహార్యం చంద్రతారాది
 తన్నమ సాత్వికం శివం"

ఆనంద తాండవాదులు, గౌరీశంకర మహాభావ రూపాలు. శంకరాచార్యులు సౌందర్య పరమావధి దేవీ భావంలో, ఆనంద పరమావధి శైవభావంలో దర్శించినాడని శ్రీమతి అన్నది.

జగల్లీల మహాభావయుక్త సంధ్యానాట్యము. ప్రళయాలు, కల్పాంతాలు, నూత్న తారాజన్ననాలు, నిత్య నూతన విశ్వోద్భవాలు, ఆనందనాట్యము, తారకల కాంతి, కాలభావసముద్భవ రహస్యము లాస్యనాట్యము. ఈ మహాభావం వెనకాల శక్తిలీల, నృత్తము అని శ్రీమతి అరమూత కన్నులతో ఏవేవో మాట్లాడింది.

2

పద్మావతి యాత్రకు వెళ్ళిందని బుచ్చి వెంకట్రావుకు తెలిసేసరికి అతనికి ఆశ్చర్యమూ, కోపమూ, ఏదో భయమూ కలిగాయి.

ఎందుకు వెళ్ళింది? తనతో చెప్పలేదే! ఇంత స్వతంత్రించిందే! ఆంధ్ర మహిళాసభ కళాశాల ముఖ్యాచారిణి, తాను పద్మావతిని చూడడానికి వెళ్ళినప్పుడు తనతో కొంచెం గట్టిగా మాట్లాడింది.

అడివి బాపిరాజు రచనలు - 7

146

జాజిమల్లి(సాంఘిక నవల)