పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“నన్నెక్కడకైనా సరే తీసుకువెళ్ళండి. నాలుగు రోజుల పాటు ఈ స్థితే నాకు ఉంటే నన్ను మోదవాకం పిచ్చి ఆస్పత్రిలో చేర్పించవలసిందే!"

“నీ చదువుమాట?”

“తిరిగి వచ్చి ఆలోచిద్దాము అక్కా! నా ప్రార్థన అంగీకరించండి. నా హృదయంలో ఉన్నది అంతా మీతో ఏమి చెప్పుకోగలను.”

"సరే పద్మా! హంపీయాత్ర చేసి వద్దాము. లేపాక్షి, పెనుగొండ, బేలూరు, హాలెబీడు, శ్రావణ బెలగోలా, మైసూరు, శివసముద్రం ఇవి మనం చూసి వచ్చేవి.”

“చాలా బాగుంది. మనం ఇద్దరమే! ఇంకెవ్వరూ వద్దు.”

“కాని నాకీ పనుల్లో తీరిక ఏది పద్మా!”

“ఏలాగో తీరిక చేసుకోండి. ఖర్చంతా నాదే. నాకు అతిథిగానే, గురువుగా మీరు రావాలి!”

“సరే. ప్రిన్సిపాలుగారి సెలవు తీసుకుని బయలుదేరుదాము. రేపు శనివారం బాగుంటుంది.”

“అచ్చా !"

ప్రిన్సిపాలుగారికి తన సంగతి అంతా చెప్పుకొని, పద్మావతి ఆమె కడ సెలవు తీసుకుని, శ్రీమతితో బయలుదేరి యాత్ర ప్రారంభించింది.

పాఠశాలలో ఇతరులెవ్వరికీ ఈ యాత్ర విషయం తెలియదు. వీరిరువురూ చల్లగా వచ్చి సెంట్రల్లో బొంబాయి మెయిల్ యెక్కి గుంటకల్ చేరుకున్నారు. అక్కడనుండి రైలుమారి హోస్పేటచేరి, హంపీ చేరుకున్నారు.

హంపీలో డాక్ బంగళాలో మకాం పెట్టి, మూడు రోజులపాటు శిధిలాలన్నీ చూచారు.

"శ్రీకృష్ణదేవరాయల భువనవిజయం ఇవాళ ఎల్లావుందో చూడు! ఈలా ఒక మహానగరం శిధిలం కాకపోతే మనకు ఈ మహాద్భుత ప్రదర్శనశాల ఉండేదా పద్మా?”

“అదేమిటండీ అల్లా అంటారు ఆనాడు తల్లికోటలో జరిగిన భయంకర పరాభవం ఆంధ్రుల చరిత్రనే కాకుండా, భారతీయ చరిత్రనే మార్చెయ్యలేదండీ అక్కా!”

"అవునమ్మా! నేను చరిత్రలో అలా జరగడమే మంచిదనే మతిలేనిదాన్ని కాదు. ప్రతి చెడ్డలోనూ మంచి కూడా ఉందని.”

వారు హజారు రామస్వామి, విఠలనాథకోదండస్వామి, విరూపాక్షస్వామి వారల దేవాలయాలన్ని దర్శించారు.

సరిగమ పదనిస అని పాడే సంగీత స్తంభం పరిశీలించారు. రాతిరథం ఆనందాశ్చర్యాలతో దర్శించారు. విజయనగర శిల్పంలో మనుచరిత్రలాంటి కావ్యసౌందర్యం ఉందని శ్రీమతి కరుణామయి పద్మకు బోధించింది.

హంపీ నుండి బయలుదేరి పెనుగొండ లేపాక్షి వెళ్ళా. విజయనగరం తర్వాత పెనుగొండే ఆంధ్ర సార్వభౌముల రాజధాని. అంతకుముందు చక్రవర్తులు వేసవికాలాలు పెనుగొండలో ఆ చల్లటి ప్రదేశాలలో గడిపేవారు. పెనుగొండలోనూ విజయనగర సామ్రాజ్య చిహ్నాలు హృదయాలకు ఏవో ఆవేదనలను కలుగజేస్తాయి.

అడివి బాపిరాజు రచనలు - 7

145

జాజిమల్లి(సాంఘిక నవల)