పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(అష్టమ గుచ్చము)

నరసింహమూర్తి మేష్టారు రాసిన ఉత్తరం చదువుకున్నప్పటినుండి పద్మకు ఉద్భవించిన ఆవేదన నానాటికి ఎక్కువైపోయిందీ. తనకెంత విసుగు ఉద్భవింపచేసినా, నరసింహమూర్తి మేష్టారు తన దగ్గరకు రావడం మాయమైపోగానే, ఆ లోటామెకు రోజురోజుకూ ఆందోళన ఎక్కువ చేయసాగింది. సాయంకాలం కాగానే ఆయన వస్తాడన్న భావం అతడు రాకపోయేసరికి గుండె గుభేలుమనటమూ! నాలుగురోజులు గడిచేసరికి పద్మావతికి భరింపరాని బాధ కలిగింది.

ఏమయ్యాడు? ఎక్కడ బాధపడుతున్నాడో! సముద్రంలోనో ఏ రైలుకిందోపడి ప్రాణం తీసుకోలేదుకదా!

ఈమధ్య తాను సముద్రతీరానికి వెళ్ళినా, సముద్రంగాని, ఇసుకతిన్నెలుగాని, కెరటాలుగాని, నీరదూరాలుగాని కనపడడం మానివేశాయి. కారులూ, జనమూ, రేడియో సంగీతమూ, జనంఘోషా, వేషాలు, భాషలూ, ఒత్తుగా, ఘాటంగా కమ్ముకువచ్చి కనబడతాయి. అలాంటిది నేడు నరసింహమూర్తి మేష్టారు ఆమె జీవితంలోంచి మాయమై పోయినప్పటినుండీ, ఆమెకు సముద్రం ఎంతో దూరంగా చిన్న కెరటాలతో దృశ్యం కాసాగింది. సముద్రపు చేపలు నీటిలో ప్రాణరహితమై తేలిపోయి కనబడినవి. ఎక్కడ చూచినా మండిపోతూ ఇసుక ఎడారిలా సముద్రమూ, ఇసుక తీరాల బయళ్ళూ ఆమె మనోనేత్రాలకు గోచరించినవి.

ఆమె కన్నులు మూసుకోలేదు. కన్నులు తెరచి ఉంచుకోలేదు. నిద్దుర ఎండిపోయింది. నుదురు మండిపోతున్నది. ఒళ్ళు సలసల కాగిపోతున్నది.

ఆమె ఆంధ్ర మహిళా సభలో ఉండలేకపోయింది. భర్త దగ్గరకు వెళ్ళలేదు. సుశీల కడకు పోలేదు.

ఏమవుతుంది. తన బ్రతుకు? ఎందుకు ఈ ఆవేదన? అందరికీ ఈలాంటి పరిస్థితులు సంభవిస్తాయా? వారికీ ఏదో సంఘటనలు జీవితంలో ప్రత్యక్షం అవుతూనే ఉంటాయి. ఊహించుకోలేని కష్టాలు వారికీ కలుగుతున్నాయి. అవ్యక్తమైన ఆశయాలు, వ్యక్తావ్యక్తమైన ఆశలూ వారికీ ఉన్నాయి. తనకింత బాధ ఏమి? తన మనస్సుకు ఇంత కుదురులేదేమి?

శ్రీమతీ దేవిని తనతో రమ్మని పద్మ ఆహ్వానించింది.

“ఎక్కడకు పద్మా?”

“రండి అక్కా! నన్ను మీ రెక్కడకైనా నాలుగు రోజులపాటు తీసుకుపొండి!”

“మనం ఇద్దరమే!”

“ఆ!”

“ఏమిటీ అసలు విషయం ?”

అడివి బాపిరాజు రచనలు - 7

144

జాజిమల్లి(సాంఘిక నవల)