పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“నాయనా! చుక్కానిలేని నావలావున్న ఈ చీకు పడవకు నీ హృదయం అనే రేవులో ఆశ్రయం ఇచ్చావు.

“అరవైమూడు సంవత్సరాలు గడిచి, అరవైనాలుగో ఏడు జరుగుతో ఉంది. ఇంతవరకూ నా జీవితంలో అసత్యము, అధర్మమూ ప్రవేశించలేదు. నేను నీ దగ్గర ప్రవేశించక మునుపు బ్యాంకిలో రెండువేలు దాచుకున్నాను. నువ్వు నా కిచ్చిన జీతాలు పదిహేను వందలవరకూ ఉన్నాయి.

“నువ్వూ, నీ భార్య - బిడ్డలు లేని నాకు బిడ్డలయ్యారు. మీమీద నా ఆశలన్నీ పెట్టుకుని, మీ ఆనందం నా ఆనందం అనుకుని, మీ వృద్ధి నావృద్ధి అనుకొని సంతోషంతో పొంగిపోయాను.

“కాని పరిస్థితులు ఈలా తారుమారు అవుతాయని అనుకోలేదు. పద్మావతి సినిమాతార సగం అయింది. తక్కిన సగమూ పూర్తిఅయిపోతుంది. నువ్వు తారలమధ్య చంద్రుడవు అయిపోతున్నావు. ఈ విధానం ఎంతవరకూ సాగిపోతోందో! నీ కంపెనీ ఆఫీసులో కనుక్కుంటే ఈ మధ్య నువ్వు చాలా ఖర్చు పెడుతున్నట్లు తెలిసింది. ఎందుకో నేను ఊహించదలచుకోలేదు.

“నేనూ నీకూ అవసరం లేదు. నీ భార్యకూ అవసరం లేదు. మీ జీవితాలు విచిత్ర పరిణామాలు పొందాయి. ఇంకా అనేక చిత్రవిచిత్ర పరిణామాలు మీ జీవితంలో రాగలవు! కాన ఆ పరిణామాలలో నాకు భాగం లేదు. నేను భాగం పంచుకొనే రకం కావు అవి!!

“నీకోసం పద్మావతీ, పద్మావతికోసం నువ్వూ ఉద్భవించారనీ, మీ ఆదర్శ జీవితం, హీనస్థితిలో వున్న కులాల వారికీ, జాతులకే కాకుండా ఉత్తమ కులాలవారికీ, జాతులకూ కూడా ఆదర్శం కాగలదనీ ఉప్పొంగిపోయాను. కాని మీరూ అందరితో పాటువారే అయ్యారు.

“ఈ సందర్భంలో నేను మీ దగ్గిరలేకుండా దూరదేశాలకు పోతే మీరు ఒకరికొకరు సన్నిహితులు అవుతారేమో!

“మీ ఇద్దరూ, నేను ఆశించే రీతి వృద్ధిపొంది తిరిగి కలియుదురుగాక. మీకు దీర్ఘాయురోగ్య ఐశ్వర్యాలూ, దాంపత్యప్రేమ సాఫల్యమూ, బహు సంతాన లాభమూ కలుగుగాక అని ఆశీర్వదిస్తూ,

గాఢానురాగంతో

నరసింహమూర్తి మేష్టారు.”

ఈ ఉత్తరం చూడగానే బుచ్చి వెంకట్రావు మొదట చాలా ఆశ్చర్యం పొందాడు. “ఏడిశాడు వెఱ్ఱిబాగులవాడు! పోతేపోయాడు. శని విరగడైంది అనుకుంటాను. ఈ రోజుల్లో పెద్ద నీతినియమాలు రాస్తాడేమిటి? దేవుడుంటే నీతినియమాలూ; దేవుడేడి. గోపరాజు రామచంద్రరావు అనే ఆయన వాదించినట్టు? ఇతరులకు ఇబ్బంది లేకుండా ఉంటే చాలు. కాని నాకు నీతులు చెప్పవస్తాడేమిటి? అతని మోములో చిడిముడిపాటు కాంతులు ప్రసరించాయి.

అడివి బాపిరాజు రచనలు - 7

142

జాజిమల్లి(సాంఘిక నవల)