పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నరసింహమూర్తి మేష్టారు నిద్ర చెరిపాము! సెలవు గురువుగారి గురువుగారూ!” అంటూ తుర్రున వీధిలోనికి తేలిపోయింది. గుమ్మం దగ్గరనుంచి "బుచ్చీ! రేపు సాయంకాలం రా! మరచి పోకు” అని కారెక్కి బుర్రుమనిపించి మాయమైంది.

బుచ్చి వెంకట్రావుకు కోపం వచ్చింది. “ఈ ఆడవాళ్ళు వట్టి బ్రహ్మరాక్షసులయ్యా!” అంటూ సోఫాలో కూచుని సిగరెట్టు వెలిగించాడు.

“ఎంతవరకూ వెళ్ళింది ఈ వ్యాపారం?”

“ఎంతవరకూ వెళ్ళడమేంటి? చాలా దూరం వెడితే, ఆ అప్సరస రాక్షసి అలా పారిపోతుందటయ్యా వెఱ్రి బ్రాహ్మడా?”

నరసింహమూర్తి మేష్టారు ఒక్కనిమేషం బుచ్చి వెంకట్రావును తీక్షణంగా పరికించినాడు. సరే ఇంకా రాగాలాపన ప్రారంభం కాలేదనుకున్నాడు.

“ఏంది అట్టా చూస్తున్నావు. నేను రాక్షసునిలా కనపడుతున్నానా, లేక నేజెప్పింది అసత్యమనుకుంటున్నావా?”

బుచ్చి వెంకట్రావు మోము జేవురించింది. అతడు జర్రుమని లేచి తన పడకటింటిలోనికి పోయినాడు.

4

మరునాడు చాలా పొద్దెక్కేవరకూ బుచ్చి వెంకట్రావు లేవలేదు. మామూలు అలవాటుగా నరసింహమూర్తి మేష్టారు లేవలేదు. పనివారు లేచి, ఇల్లంతా సర్దినారు. పనిమనిషి వచ్చింది. అంట్లువేసే నరసింహమూర్తి మేష్టారు కనబడలేదు. వంటగదిలోకి ఎవరూ వెళ్ళడానికి వీలులేదు. కాబట్టి పనివాడు లోపలికి వెళ్ళి చూడలేదు.

బుచ్చి వెంకట్రావుకు తొమ్మిది గంటలకు మెలకువ వచ్చింది. స్నానాలగదిలోనికి వెళ్ళి మొగం కడుక్కుని కాఫీ కనివచ్చి, “మేష్టారూ కాఫీ ఏదయ్యా?” అని పొలికేక పెట్టినాడు.

పనివాడు పరుగునవచ్చి, “పొద్దున్నుండీ ఆయన అలికిడి లేదు స్వామీ? ఏందో?" అని మనవి చేశాడు.

“ముసలివాడయిపోతున్నాడు! ఇంకోరెవర్నన్నా పెట్టుకోవాలి” అంటూ వంట ఇంటివేపుకు వెడితే, బుచ్చి వెంకట్రావుకు తలుపులు వేసే వున్నట్లు తెలిసింది.

“ఏడీ మేష్టారు” అని వెంకట్రావు గొణుగుకుంటూ మళ్ళీ మేడ యెక్కి నరసింహమూర్తి మేష్టారు గది దగ్గరకు వెళ్ళితే ఆ తలుపు పైన గొళ్ళెం పెట్టి ఉంది.

“ఇదేంది చెప్మా!”

బుచ్చి వెంకట్రావు తలుపు గొళ్ళెం తీసి లోనికి వెళ్ళాడు. అన్నీ సర్ది ఉన్నాయి. బల్లమీద తనకు వ్రాసినట్లు కవరు వుంది. అతడా కవరు చింపి లోని ఉత్తరం చదవడం సాగించినాడు.

“చిరంజీవి నా పుత్రసమానుడైన బుచ్చి వెంకట్రావుకు దీర్ఘాయువుగా, ఆరోగ్యయుతునిగా బహు సంతానవంతునిగా ఆశీర్వదిస్తూ!

అడివి బాపిరాజు రచనలు - 7

141

జాజిమల్లి(సాంఘిక నవల)