పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“ఏం? రాధాకృష్ణ స్నేహానికి ఏమి వచ్చింది? పరీక్షలో నెగ్గాలనే పంతంతో చదువుతున్నాను. కనుక షికార్లు మానాను... అంతే. రాధాకృష్ణ గొడవ ఏమి వచ్చింది? రాధాకృష్ణగారు చాలా మంచివాడు. ఆయనవల్ల ఇంతపేరూ ప్రతిష్టా, స్వంత సంపాదనా వచ్చింది.”

“అలాగా?”

“కాదుటండీ, మేష్టారూ, నా మనస్సంతా ఇప్పుడు పరీక్ష మీద లగ్నం అయివుంది. మీరు రాధాకృష్ణగారి మీద నేరాలు గీరాలు చెప్పి మనస్సు పుండు చేయకండి. మీరు ఈ రెండు మూడు నెలలూ నాకు కనపడకుండా వుంటే మంచిది. నేవెడ్తాను సెలవు.”

పద్మావతి లోనికి వెళ్ళిపోయింది. నరసింహమూర్తి మేష్టారు దిగులుపడి పోయినాడు. అతని మనస్సు క్రుంగిపోయింది. కాళ్ళీడ్చుకుంటూ బస్సు దగ్గరకు పోయినాడు.

అతనికి తాను అతివృద్దుడైనట్లు తోచింది. రాధాకృష్ణ ఎందుకు దాపురించాడు? ఓ పార్శ్వం పండింది. తానింక ఎవరికి కావాలి? తన అవసరం ఎవరికింక? బుచ్చి వెంకట్రావు ఇంట్లో తాను వంటవాడు. తనబాణి పాతరకం. రాధాకృష్ణ సంగీతమేళానికి తానెందుకూ పనికిరాడు. తెలుగుతనం లేని పిచ్చిపాటలు కోరే లోకానికి కళాయుక్తమై, పరిపూర్ణ సౌందర్యరూపకమైన తన ఆంధ్రవాణి ఎవరికి అవసరం గనుకనూ? దేశం నీచస్థితిని పొందినప్పుడు కళ కూడా నీచస్థితిని పొందుతుంది. కవులు నీరసించారు. గాయకులు నీరసించారు. శమ్మంగుడి ముసిరి, సుబ్బలక్ష్మి, వెంకటస్వామి నాయుళ్ళను ఎవరు గౌరవిస్తారు? వారి గానం దేశంలో లక్షకు ఒకరు వింటారేమో! తప్పితే ఇద్దరు వినవచ్చును. కాదయ్యా పది మంది ఆంధ్రులైన హరినాగభూషణంగారు, పారుపల్లి వారు వారణాసి బ్రహ్మయ్య, బలరామయ్యగార్లు, మంత్రవాది వెంకటప్పయ్య కాంగ్రెసులో సిసలైన పెద్దలలా వెనకే ఉండవలసి వచ్చింది.

అతడు పెద్ద నిట్టూర్పు విడిచాడు. నల్లబజారు నాయకులు, మాయాబజారు సినిమాలు, మాయారంభలైన తారలు, గారడివాండ్రైన గాయకులు! చాలయ్యా మదరాసు!

ఏమిటి తన కర్తవ్యం, తానూ క్షేత్రయ్యలా తీర్థయాత్రలు సేవించి, “భగవాన్ నువ్వైనా విను, ఈ పౌరాణికమైన వాణి” అని ఆయన దగ్గిర పాటలు పాడుకోవచ్చును.

ఏమి బుద్ది పుట్టిందో అతడు చటుక్కున లేచాడు. అర్థరాత్రి దాటినా ఏదో ఉత్తరం వ్రాస్తూనే వున్నాడు. హాలు గడియారం రెండు కొడుతూ ఉండగా బుచ్చి వెంకట్రావు, సుశీలా కారులోంచి దిగి, పకపక నవ్వుకుంటూ, తలుపు తట్టినప్పుడు నరసింహమూర్తి మేష్టారు ఉత్తరం డ్రాయరులో దాచి వచ్చి వీధి తలుపు తెరిచాడు.

అతడున్నాడనైనా లేకుండా బుచ్చి వెంకట్రావు సుశీలను కౌగలించుకుని “ఇవాళ మనప్రోగ్రాం గ్రాండుగా సాగిందికదూ! ఏం ఇవాళ ఇక్కడ పడుకోరాదూ?” అని ఆ యువతి మోము తనవైపు తిప్పుకొని, పదిముద్దులామె పెదవులపై కురిపించినాడు.

సుశీల చల్లగా అతని ఆలింగనాన్నుండి చిత్రంగా తప్పుకొని, “అలాంటి విద్రోహాలులేవు మన జాతకంలో! ఇంతవరకూ, మన సరిహద్దు! సో! సో! సెలవు!

అడివి బాపిరాజు రచనలు - 7

140

జాజిమల్లి(సాంఘిక నవల)