పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ ప్రళయంలో ఒంటివాడైపోయినాడు నరసింహమూర్తి మేష్టారు. అవతల బుచ్చి వెంకట్రావు ఇంటినిండా సినిమా తారలు, తారకులు నిండిపోసాగినారు. చిట్టిచిట్టి దర్శకులూ, మేరు పర్వతం దర్శకులూ కాఫీ వేళకూ, సినిమా వేళకూ, షికారు వేళకూ సిద్ధం. బుచ్చి వెంకట్రావుతో “మనం ఇలాంటి ఆదర్శరూపమైన చిత్రం తీయాలండీ వెంకట్రావుగారూ!” “మీరే నాయకులు, సుశీలాదేవి నాయిక. ఇంక చిత్రం పట్ట పగ్గాలుంటాయా?” ఇవి నిత్య సంభాషణలు.

ఇంక తనూ! “మేష్టారూ! కాస్త కాఫీ తయారు చేయండి.” “ఏం మాష్టారూ కొంచెం వుండ్‌లాండ్సుకు ఫోనుచేసి, ఇన్ని ఫలహారాలు అవీ తెప్పించండి!” “ఇదిగో నిద్రా? మేష్టారూ, ఏమిటయ్యా వెళ్ళి నా కారుమీద సుశీలాదేవిని తీసుకురండి!” ఇలా మాష్టారు బుచ్చి వెంకట్రావుకు పెద్ద బంట్రోతైనాడు.

అన్నీ ఓపిగ్గా చేస్తున్నాడు! పెద్దవాడు! అయినా పూర్వకాలపు ఘటం కనుక కాస్త జబ్బపుష్టీ, శక్తి కలవాడు.

బుచ్చి వెంకట్రావు చివరకు ఒక సినిమా తీయడానికి నిశ్చయించాడు. తను కంపెనీకి పేరు పెట్టమని సుశీలనే అడిగినాడు. నరసింహమూర్తి “నీ కెందుకు వెంకట్రావూ, ఈ సినిమా పిచ్చి? ఏదో రొయ్య పప్పు వ్యాపారం చక్కగా సాగుతోంది. నాలుగురాళ్ళు వస్తున్నాయి. సినిమా అంటే లక్షలమీద మాట. ఆ డబ్బంతా గంగపాలే కావచ్చును. లేకపోతే కూపంపాలే అనుకో,” అని నరసింహమూర్తి మేష్టారు అన్నాడు.

“ఉండవయ్యా! నీ సలహా ఎవరికి? ఇందులో మంచి చెడ్డలన్నీ సుశీలకు తెలుసు.” అన్నాడు బుచ్చి వెంకట్రావు. రామచంద్ర అనే ఒక డైరెక్టరు: ఊరుకోవయ్యా స్వామి! పానకంలో పుడకలా అడ్డం రాకు.

సోమేశ్వరరావు అనే సినిమా నటుడు : మాకు సంబంధించిన విషయాలలో మీ సలహా ఎందుకండీ! లక్షాధికారి వెంకట్రావుగారు బొమ్మ తీస్తామనడం ఏమిటి, వెధవ స్త్రీ దారిలో ఎదురుపడినట్టు మీరు అడ్డం రావడం ఏమిటి?

సుశీల : మేష్టారు సినిమా గొడవలు మీ కేమీ తెలియవు. మీరు వింటూ వూరుకోండి. వెంక: మీ వంటపని మీరు చూసుకోండి బాబూ!

నరసింహమూర్తి మేష్టారుకు పిడుగు తాకినట్లయింది. అతడు తెల్లబోయి అలా నిలుచుండిపోయినాడు. గజ గజ వణికిపోయినాడు. అతని కళ్ళల్లో నీరు తిరిగింది. తూలుతూ అతడు లోపలికి వెళ్ళిపోయాడు.

3

“అమ్మాయీ! ఆయన సంగతి శ్రుతిమించి రాగాన్ని పడింది.” అన్నాడు పద్మావతితో.

“ఏమిటండి అది? నాకు పరీక్ష రోజులు వస్తున్నాయి” రాక్షసిలా చదువుతున్నాను. మొదటి తరగతిలో నెగ్గి తీరాలి!”

“నాకు చాలా సంతోషంగా వుంది. నువ్వు షికార్లు మానివేసి చదువులో పడ్డావు. ఆ రాధాకృష్ణ స్నేహం తగ్గించావు; కాస్త నాకు మనస్సు ఊరటపడింది.”

అడివి బాపిరాజు రచనలు - 7

139

జాజిమల్లి(సాంఘిక నవల)