పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(షష్ఠమగుచ్చము)

సంగీత దర్శకుడైన రాధాకృష్ణ ఇంట్లో, పద్మావతి సంగీత ప్రదర్శనమైన కొద్దిరోజులకు, ఒక సాయంకాలం, పద్మావతి స్నేహితురాండ్రతో చీనాబజారుకు వెళ్ళింది. ఫేసుపౌడరూ, తిలకాలూ, సబ్బులూ అలాంటివన్నీ కొనుక్కుందామని వారి ఉద్దేశం. హాస్టలుకు కావలసిన సరుకులు కొత్వాల్ సావిడిలో కొనడానికి వసతి గృహాధికారిణి శ్రీమతి కరుణామయిగారు వస్తూ వుంటే వారితో ఈ బాలికలందరూ వచ్చినారు. అచ్చట ఒక కొట్టులోనికి ఎగబడి ఏవో రంగు రంగుల చీరలూ, రవికల గుడ్డలూ బేరం చేస్తున్నారు. అక్కడికి రాధాకృష్ణా అతని భార్య సుశీలాదేవి చక్కావచ్చారు.

"నమస్కారం పద్మావతీదేవిగారూ! చీరలు కొంటున్నారా ఏమిటి?” అంటూ సుశీల, పద్మావతీ తక్కిన బాలికలూ ఉన్నచోటికి వచ్చింది.

“నమస్కారం సుశీలాదేవిగారూ! అదిగో రాధాకృష్ణగారూ కూడా వచ్చారు. నమస్కారం రాధాకృష్ణగారూ! వీరందరూ మా సభా పాఠశాలలో చదువుకుంటున్నారు. వీరు కరుణామయిగారు, మా హాస్టలు అధికారిణి! అక్కగారూ, వీరు రాధాకృష్ణగారు. వీరు వారి భార్య సుశీలాదేవి గారు! ఈమె మళయాళీలు. రాధాకృష్ణగారు తెలుగువారు. ఎంతో ప్రసిద్ధి పొందిన సంగీత దర్శకులు” అని తొందర తొందరగా మాట్లాడింది.

పద్మావతి మోము ప్రఫుల్లమవడమూ, ఆమె కళ్ళలో కాంతి శ్రీమతి చూసింది. శ్రీమతి కరుణామయికి ఏమి బుద్ధి పుట్టిందో కాని సుశీలను చూచి, “ఏమండీ సుశీలాదేవిగారూ, మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారే! కొంచెం మళయాళీయాస ఉందనుకోండి! మీరు తప్పక మా ఆంధ్ర మహిళాసభలో మెంబరు కాకూడదా?” అని అడిగింది.

సుశీల : తప్పక చేరుతానండి. రేపో ఎల్లుండో వీలు చేసుకుని వస్తాను.

కరుణా : మీరు మీ భర్తగారిచేత మా సభలో పదిహేను రోజుల తర్వాత జరిగే సభలో సంగీతం పాడించాలని ప్రార్ధిస్తున్నాను.

రాధా : మా గృహలక్ష్మిగారిని ప్రార్థించనక్కరలేదు. కరుణామయిదేవిగారూ! మీరు ఎప్పుడు వచ్చి పాడమంటే అప్పుడు వచ్చి పాడడానికి సిద్ధం.

పద్మావతి : తప్పక రండి రాధాకృష్ణగారూ! ఆ సందర్భంలో సుశీలాదేవిగారూ కూడా పాడతారు.

సు : పద్మావతీదేవిగారూ పాడతారు.

క : చాలా బాగా ఉంది. ఆ సభ దివ్యంగా రక్తి కడుతుంది.

పద్మా : అమ్మో! నేను పాడడమే!

సు : నేను పాడితేదా చాలా బాగా ఉండునా ఏమీ ఏమమ్మా నీవుదా చెబుతావు. నువ్వు పాడతానంటేనే నేను పాడటానికి మాట ఇస్తును.

అడివి బాపిరాజు రచనలు - 7

129

జాజిమల్లి(సాంఘిక నవల)