పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“అందులోనూ నిజం వుంది. అయినా ఆడవాళ్ళు కూడా ఎక్కువగా జాతీయ జీవనంలో పాలుపంచుకోవాలి.”

ఆ విధంగా పద్మావతిని ఊరడింపచేసి శ్రీమతి వెళ్ళిపోయింది.

పద్మావతికి ఏదో వర్ణనాతీతమైన శాంతి కలిగి దిండుపైన తల వాల్చింది. ఆ మరునిమిషంలో నిద్రాదేవి ఆమెను తల ఒడిలోకి గాఢంగా ఒరిగించుకొన్నది.

3

సంగీత దర్శకుడు రాధాకృష్ణ స్వయంగా తన గురువుగారైన నరసింహమూర్తి మేష్టారిని వెంకట్రావుగారింటికి చేర్చాడు. వారు ఇంటికి వెళ్ళేటప్పటికి బుచ్చి వెంకట్రావు హాలులో ఎలక్ట్రిక్ దీపం వెలుతురున పేపరు చదువుకొంటున్నాడు.

“మేష్టారూ రావడం ఆలస్యం చేశారే! పద్మ కులాసాగా వుందికదా?” అని బుచ్చి వెంకట్రావు నరసింహమూర్తి మేష్టారును పలకరిస్తూ, అతనితో వచ్చిన రాధాకృష్ణ వైపు తేరిపార చూచాడు. ఆ చూపులో "ఎవరయ్యా యీ అతి పట్నంవాసం వాడు!” అన్న ప్రశ్న స్పష్టంగా మూర్తించింది.

“ఏమీలేదు. ఈయన రాధాకృష్ణ! చాలా పేరు పొందిన సంగీత దర్శకుడు. నాతోపాటు మా గురువుగారి దగ్గర సంగీతం నేర్చుకొన్న వెంకటరత్నం శిష్యుడు. నా దగ్గిరా కొంతకాలం శిష్యరికం చేశాడు. ఈతనిది బాపట్లలే! చటుక్కున సముద్రం ఒడ్డున కలుసుకున్నాం” అని నరసింహమూర్తి మేష్టారు తొందరగా జవాబు చెప్పినాడు.

“అలాగా. చాలా సంతోషం!” అంటూ లేచి బుచ్చి వెంకట్రావు రాధాకృష్ణ చేతిని స్పృశించి కరచాలనం చేశాడు.

రాధాకృష్ణ చేయి నెప్పెట్టింది. ఆరి ఉద్దండపిడుగా, చేయి కాస్తయితే ముక్కలయి వుండును. ఎంత బండగా ఉన్నాడు! అందుకనే ఆ నీలికలువ పూవులాంటి ఆ అందమైన బాలిక అంత బాధపడుతున్నట్లు కనబడింది. అని అనుకున్నాడు రాధాకృష్ణ.

బుచ్చి: కూర్చోండి రాధాకృష్ణగారూ! మిమ్ములను కలుసుకోవడం చాలా ఆనందంగా వుంది. మా ఆవిడ చాలా గొప్ప సంగీత పాఠకురాలు అంటారు మా నరసింహమూర్తి మేషారు. మీరు వినాలి. మీ అభిప్రాయం చెప్పాలి.

నర: అదేనయ్యా వస్తూ అనుకున్నాము. రాధాకృష్ణ సంగీతం నువ్వు వినితీరాలి. ఏమయ్యో

రాధాకృష్ణా! మా బుచ్చి వెంకట్రావుకు సంగీతం అంటే ప్రాణం.

రాధా: అవును! ఆయన్ని చూడగానే గ్రహించవచ్చును. ఆయన కళాహృదయం ఈ హాలు చూడగానే గ్రహించవచ్చును.

నర: ఈ రోజుల్లో డబ్బున్న ఒక్క పెద్దమనిషి ఒక్క కళాపూర్ణమైన బొమ్మనుకొని తన ఇల్లు అలంకరించుకొన్న పాపాన పోతున్నాడటండీ?

రాధా: ఈ రోజులలో లలితకళలు నేర్చుకోవడం ముష్టి ఎత్తుకోడానికే! జమీందారులు

వారింక శతాబ్దాల నుంచి వచ్చిన సంస్కృతి ప్రీతిచేత కళావేత్తలను పోషిస్తూ వచ్చారు.

అడివి బాపిరాజు రచనలు - 7

125

జాజిమల్లి(సాంఘిక నవల)