పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బంతి మొదటి అరగంటా జూనియర్ జట్టు గోలు దగ్గరే ఉంది. సీనియర్ వాళ్ళు నాలుగు గోలులు చేశారు జూనియర్ గోలు కీపరు దిట్టమయిన వాడవడంవల్ల గాని లేకపోతే ఏ డజను గోలులో అయి తీరవలసిందే.

అరగంట ఆఖరు కావలసిందే ఇదంతా చెక్కు చెదరకుండా, తన స్థానం కదలకుండా, విస్తుపోయి చూస్తున్నాడు ఎల్లమంద. ఇంతసేపటివరకూ తన్ను ఒంటరిగా వదిలారని ఎల్లమంద హృదయం కుంగిపోయింది. ఎన్నిసారులు ప్రయత్నం చేసినా, బంతి ఎల్లమంద దగ్గిరకు మైలుదూరానికన్నా తక్కినవాళ్ళు పంపిస్తేనా!

అరగంట ఈల అయిదు నిమిషాలకు మధ్యవర్తి (రిఫరీ) వేస్తాడనగా సీనియర్ జట్టు హాఫ్‌బాక్ ఒకడు బంతిని తన ఫార్వర్డుకు అందివ్వడంలో మోడులా తన స్థానంలో నిలుచుండి ఉన్న ఎల్లమంద దగ్గరకు పొరబాటున పంపాడు.

నిద్రపోతూ ఉన్న మనుష్యునిలా ఉన్న ఎల్లమంద కాలి దగ్గరకు ఆ బంతి వచ్చింది. ఆ బంతితో పోటీగా ఆ హాఫ్‌బాక్ పరుగున వచ్చాడు. కాని ఎల్లమంద ఒక్క నిమిషంలో మారిపోయాడు. అతడు ఆటంబాంబో, టార్పెడో, రెక్కల బాంబో, తుపాకీ గుండో! ఆ బంతీ అతడు అమిత వేగంతో తుపాకీ గుండులా ఆ హాఫ్‌బాక్‌ను తప్పించి ఝలఝల, ధళధళ, ఫెళఫెళ వేగంగా ముందుకు పోయాడు. బాక్‌ను తప్పించాడు. గోలుముందర గోలుకీపరు పది అడుగుల ఇవతలగా తుపాకీ గుండులా నెట్టులోకి వెళ్ళిపోయింది బంతి. ‘గోల్” అని ఆ ఆటస్థలంలో ఉన్న సర్వజనులు సముద్రపు హోరులా అరిచారు. కాని ఎల్లమందను హస్త స్పర్శ చేయడంగాని, అతనికి కృతజ్ఞత తెల్పడంగాని అందరూ మరిచారు.

ఫార్వర్డులు సెంటరుకు వచ్చారు. అరగంటకి రెండు నిమిషాలు ఉంది. సీనియర్ జట్టువారు అందిచ్చుకుంటూ ముందుకు పోయారు. ఎల్లమంద ఆ బంతిని తన కాలికి తీసుకుని స్వయంగా ప్రేక్షకులు కూడా గమనించని వేగంతో బయలుదేరాడు. ఎదుటి ఫార్వర్డులను తప్పుకున్నాడు. హాఫ్‌బాక్‌లను తప్పుకున్నాడు అక్కడనుంచి గోలు ఏభై గజాలుందనగా ఎడం కాలితో బంతిని తన్నాడు. ఆ బంతి పక్షిలా వెళ్ళింది. ఒక మూలనుంచి, గోలుకీపరు ఎగిరి చాపిన చేతులను తప్పుకుని, గోలులో వాలింది.

అయ్యా! ఇక ఆ ఆటస్థలంలో బయలుదేరిన గగ్గోలు, అల్లరి హంగామా నవీన కవులందరూ కలిసి ఏక కంఠంతో వర్ణించినా చాలని పరవళ్ళెత్తి ఉప్పొంగిపోయింది. ఈ పట్టు జూనియర్‌లు ఎల్లమందను భుజాలమీద ఎత్తుకొని జయజయ ధ్వానాలు చేస్తూ మధ్యకు తీసుకువచ్చారు. ఆటస్థలం అంతా హుర్రాలు, బ్రేవోలు! ఇంతలో రిఫరీ ఈల వేశాడు.

ఆ అల్లరి ఇంకా పదివేలరెట్లు ఎక్కువయిపోయింది. ఎల్లమందని ప్రజలంతా సర్కసు జంతువును చూచినట్లే!

“ఏ వూరండి మీది?”

“ఇదవరకు ఎక్కడ ఆడారండి?”

“మీరు ఏమిటండి?”


అడివి బాపిరాజు రచనలు - 7

10

నరుడు(సాంఘిక నవల)